ePaper
Monday, November 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రభుత్వ భూములపై రియల్‌ దందా..!

ప్రభుత్వ భూములపై రియల్‌ దందా..!

📰 Generate e-Paper Clip

-ప్రభుత్వ భూములకు రెక్కలు..!

-సెంటు రూ.4 లక్షల వరకు పలుకుతున్న వైనం

-రాళ్లకుప్పంలో యథేచ్ఛగా ఆక్రమణల పర్వం

-అధికారుల మౌనవ్రతంపై గ్రామస్తుల ఆగ్రహం

సత్యవేడు నవంబర్ 2 గరుడధాత్రి :

పరిశ్రమల రాకతో భూముల విలువ పెరుగుతోంది.. ఇదే అదనుగా ప్రభుత్వ భూములపైనా కొందరి కన్ను పడింది. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ భూములు అక్రమ విక్రయాలకు వేదికవుతున్నాయన్న ఆరోపణలు సత్యవేడు మండలం వానెల్లూరు పంచాయతీ పరిధిలోని రాళ్లకుప్పంలో కలకలం రేపుతున్నాయి.
ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ శాఖదే కానీ
విలువైన భూములను సెంట్ల లెక్కన విక్రయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నా.. రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడంపై స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

మంచినీటి ట్యాంకు పరిసరాల్లో విలువైన ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

-సెంటు రూ.3 నుంచి 4 లక్షలు..!

రాళ్లకుప్పం పరిసరాల్లోని ప్రభుత్వ భూములకు ప్రస్తుతం గిరాకీ పెరిగింది. సెంటు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ధర పలుకుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి హక్కులు, అనుమతులు లేకుండానే కొందరు వ్యక్తులు భూములను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘డబ్బులు ఇవ్వండి.. స్థలం తీసుకోండి.. ఇల్లు కట్టుకోండి’ అన్న రీతిలో వ్యవహారం సాగుతోందని గ్రామస్థులు వాపోతున్నారు.

-అధికారులను మేనేజ్ చేస్తామంటూ ప్రచారం..?

ఈ వ్యవహారంలో స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న ఓ నాయకుడి పేరు వినిపిస్తోంది. రెవెన్యూ అధికారులను తాను మేనేజ్ చేయగలనంటూ భూముల కొనుగోలుదారులకు భరోసా ఇస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.

-పరిశ్రమ రాకతో పెరిగిన భూముల విలువ

వానెల్లూరు పంచాయతీ పరిధిలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరిగింది. ఇదే అవకాశంగా భావించి కొందరు ప్రభుత్వ భూములపై కన్నేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా కొందరు వ్యక్తులు, అధికారులు కుమ్మక్కు అయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ అవసరమని కోరుతున్నారు.

-గిరిజనులకో న్యాయం.. ఆక్రమణదారులకో న్యాయమా ?

స్థానికంగా సెంటు భూమి కూడా లేని గిరిజనులు ప్రభుత్వ భూముల్లోకి అడుగుపెడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలపై మాత్రం చర్యలు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. పేదలు, గిరిజనుల విషయంలో ఒక నిబంధన.. పలుకుబడి ఉన్నవారి విషయంలో మరో నిబంధనా.. అని నిలదీస్తున్నారు.

-ఏపీఐఐసీ భూములకూ ముప్పు ?

ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు కోసం సమీపంలో సేకరిస్తున్న ఏపీఐఐసీ భూములకూ భవిష్యత్తులో ఆక్రమణల ముప్పు పొంచి ఉందని పంచాయతీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి రాళ్లకుప్పంలోని ప్రభుత్వ భూముల సర్వే నిర్వహించాలని, హద్దులు నిర్ధారించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అక్రమ విక్రయాల ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత అధికారులదే. ఆక్రమణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పేదలు, గిరిజనులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!