ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమురాసు తుపానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

మురాసు తుపానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

📰 Generate e-Paper Clip

ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

తిరుపతి, నవంబర్ 2 గరుడదాత్రి న్యూస్ :

మురాసు తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో పాటు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను సన్నద్ధతపై సమీక్షించారు.

అధికారులకు కీలక ఆదేశాలు..

విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు అదనపు విద్యుత్ స్తంభాలు, అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన వెంటనే తొలగించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉండాలని, పౌరసరఫరాల శాఖ నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలి.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించి తాగునీరు, ఆహారం తదితర సదుపాయాలతో సిద్ధంగా ఉంచాలన్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ 2వ తేదీ రాత్రి నుంచి నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున మధ్య మురాసు తుపాను ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 0877-2236007

ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అనవసర ప్రయాణాలు నివారిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!