టీడీపీ, కూటమి పార్టీల ప్రలోభాలకు ఎక్కడా లొంగొద్దు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా
బైరెడ్డిపల్లి మండల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడు వ్యాఖ్య..!
బైరెడ్డిపల్లి, సెప్టెంబర్ 17 గరుడధాత్రి న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, టీడీపీ, కూటమి పార్టీల నుంచి వచ్చే ప్రలోభాలకు ఎవరూ లొంగకుండా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బైరెడ్డిపల్లి రాయల్ మహల్ కల్యాణ మండపంలో గురువారం బైరెడ్డిపల్లి మండల వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేశారు.
సమావేశంలో వెంకటేగౌడు మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థుల విజయానికి తానే స్వయంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. శక్తివంచన లేకుండా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తాను తీసుకుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎక్కడా రాజీపడకుండా ధైర్యంగా పోటీ చేయాలని సూచించారు.
అనంతరం ఆయన అధికార టీడీపీపై పలు విమర్శలు చేశారు. జగన్‌ను చూసి అధికారపక్షంలో భయం మొదలైందని, నిద్రలేవగానే చంద్రబాబు జగన్ జపం చేస్తున్నారని వెంకటేగౌడు ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం టీడీపీ సంస్కృతిగా మారిందని, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం వైఎస్సార్‌సీపీ సంస్కృతి అని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు పింఛన్ల పేరుతో చంద్రబాబు రాజకీయ డ్రామా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తేనే అది నిజమైన ప్రజా విజయమని వెంకటే గౌడ్ అన్నారు. గత ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగాయని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేస్తే విజయం సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
