ePaper
Thursday, June 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్భూసేకరణ నిలిపివేయాలంటూ రైతుల ఆందోళన

భూసేకరణ నిలిపివేయాలంటూ రైతుల ఆందోళన

📰 Generate e-Paper Clip

భూసేకరణ నిలిపివేయాలంటూ రైతుల ఆందోళన

* తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

 

సత్యవేడు ఏప్రిల్ 20

గరుడధాత్రి న్యూస్ :

 

బలవంతపు భూసేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సత్యవేడు మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇరుగుళం, పెద్దఈటిపాకం, కొల్లడం, రాచపాలెం తదితర గ్రామాలకు చెందిన రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్లేకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రైతు నాయకులు విజయశంకర్ రెడ్డి, సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2025 ఏప్రిల్‌లోనే భూసేకరణకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినా, ఇప్పటివరకు గ్రామసభలు నిర్వహించకుండా అధికారాలు ముందుకు సాగడం అన్యాయమన్నారు. రైతుల అనుమతి లేకుండా ఫారం 6(ఏ), ఫారం 7 డిక్లరేషన్‌లు జారీ చేయడం, అవార్డు ఎంక్వయిరీ చేపట్టడం 2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధమని విమర్శించారు.

2006లో శ్రీసిటీ కోసం ఇప్పటికే వేల ఎకరాలు కేటాయించినప్పటికీ, వాటిని సమర్థంగా వినియోగించకుండా మళ్లీ కొత్తగా భూసేకరణకు ప్రయత్నించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం రాచపాలెం, ఇరుగుళం ప్రాంతాల్లో ఎకరా భూమి ధర కోటి నుంచి రెండున్నర కోట్ల వరకు ఉన్నప్పటికీ, ఏపీఐఐసీ తక్కువ పరిహారంతో భూములు తీసుకోవడానికి ప్రయత్నించడం రైతులకు అన్యాయం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీసిటీ ఏర్పాటుకు తర్వాత భూ రిజిస్ట్రేషన్లపై విధించిన నిషేధం కారణంగా, పాత రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా పరిహారం నిర్ణయించడం సరైన పద్ధతి కాదన్నారు. వేలాది మంది రైతులు భూములపైనే ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో, తమ భూములను ఏ పరిస్థితుల్లోనూ అప్పగించబోమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం సుమారు 2500 ఎకరాల భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపడుతోందని పేర్కొంటూ, బలవంతపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

దాదాపు గంటపాటు నిరసన తెలిపిన రైతులు అనంతరం తహసీల్దార్ శివప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతుల సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు.

అంతకుముందు రైతులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, కాశీ ప్రతాపరెడ్డి, శ్రీరామచంద్రారెడ్డి, బాలసుందరం రెడ్డి, హరినాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకటాచలం రెడ్డి, పద్మ, శశికళ, సుప్రియ, వరలక్ష్మి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!