సంప్రదాయ ఆయుర్వేద వైద్యానికి పెరుగుతున్న అంతర్జాతీయ ఆదరణ..
బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు5
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం లోని విరూపాక్షపురం గ్రామంలో ఉన్న సంప్రదాయ ఆయుర్వేద పక్షవాత నివారణ వైద్య కేంద్రానికి విదేశాల నుంచి కూడా రోగులు తరలివస్తుండటం విశేషంగా నిలుస్తోంది.
ఎన్నో దశాబ్దాలుగా వంశపారంపర్యంగా పక్షవాత బాధితులకు ఆయుర్వేద పసరు మందుతో చికిత్స అందిస్తూ విశేష గుర్తింపు పొందిన వైద్య నిపుణులు మోహన్‌రావు, ఆయన కుమార్తె డాక్టర్ అశ్విని,కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో ఈ సేవలు కొనసాగుతున్నాయి.
ఈ ఆయుర్వేద వైద్య కేంద్రంలో ఇప్పటివరకు వేలాది మంది పక్షవాత బాధితులు చికిత్స పొంది సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చినట్లు స్థానికులు, రోగులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా రోగులు వచ్చి చికిత్స పొందడం ఈ కేంద్రానికి ఉన్న విశ్వసనీయతకు నిదర్శనంగా నిలుస్తోంది అనడంలో సందేహం లేదు.ఈ నేపథ్యంలో బుధవారం యెమెన్ దేశానికి చెందిన ఓ కుటుంబం విరూపాక్షపురంలోని ఆయుర్వేద కేంద్రాన్ని సందర్శించింది. పక్షవాత సమస్యతో బాధపడుతున్న కుటుంబ సభ్యుడికి సంప్రదాయ ఆయుర్వేద వైద్యం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అనేక ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని, విరూపాక్షపురం ఆయుర్వేద వైద్యం గురించి పలువురి ద్వారా తెలుసుకుని ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ అందిస్తున్న చికిత్సతో తమ ఆరోగ్యం మెరుగుపడుతుందనే పూర్తి విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ అశ్విని మాట్లాడుతూ, తమ తాత దివంగత రాణోజి రావు, తండ్రి మోహన్‌రావు అందించిన సంప్రదాయ ఆయుర్వేద వైద్య సేవలను వారసత్వంగా కొనసాగించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పక్షవాతంతో నిస్సహాయ స్థితిలో వచ్చిన రోగులు కోలుకుని తిరిగి నడుస్తూ, ఆనందంగా తమను ఆశీర్వదిస్తూ వెళ్లడం కన్నా గొప్ప సంతృప్తి మరొకటి ఉండదన్నారు.
ఎలాంటి ప్రచారానికి ఆశపడకుండా సేవాభావంతో ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందించడం తమ కుటుంబ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా మరింత మంది పక్షవాత బాధితులకు అందుబాటులో ఉండేలా సేవలను విస్తరిస్తామని వెల్లడించారు.
వైద్యరంగంలో ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ, సంప్రదాయ ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకూ పెరుగుతుండటం విశేషం. ముఖ్యంగా విరూపాక్షపురం ఆయుర్వేద పక్షవాత నివారణ కేంద్రానికి దేశ విదేశాల నుంచి రోగులు రావడం, ఈ వైద్య విధానానికి లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
