ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీసిటీ ఈపాక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

శ్రీసిటీ ఈపాక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

📰 Generate e-Paper Clip

శ్రీసిటీ ఈపాక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

సత్యవేడు, ఏప్రిల్ 26

గరుడధాత్రి న్యూస్ :

తిరుపతి జిల్లా శ్రీసిటీ పారిశ్రామికవాడలోని ఈపాక్ పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో దాదాపు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే, అప్రమత్తంగా వ్యవహరించిన కార్మికుల చొరవతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెద్ద ప్రమాదం తప్పింది.

శ్రీసిటీ పరిధిలోని చిగురుపాలెం గ్రామ సమీపంలో ఉన్న ఈపాక్ పరిశ్రమలో శనివారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పరిశ్రమ యాజమాన్యం వెంటనే స్థానిక అగ్నిమాపక శాఖకు సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న సత్యవేడు అగ్నిమాపక కేంద్ర అధికారి రాజయ్య ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే, వారు చేరుకునేలోపే పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై మంటలు మరింత వ్యాపించకుండా సమర్థవంతంగా అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనలో పరిశ్రమలోని యంత్రాలు, ముడి సరుకు మరియు ఇతర సామగ్రికి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మొత్తం నష్టం సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి రాజయ్య మాట్లాడుతూ, పరిశ్రమ కార్మికులకు అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంటలను అదుపు చేసే విధానాలపై ముందుగానే శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ శిక్షణ ఫలితంగానే కార్మికులు ధైర్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు.

కాగా, ఈపాక్ పరిశ్రమలో ఎయిర్ కండీషనర్లకు సంబంధించిన కంప్రెసర్లు, వాషింగ్ మిషన్ల విడిభాగాలు తయారు చేసి వివిధ కంపెనీలకు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!