ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీసిటీ టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి పెను ప్రమాదం

శ్రీసిటీ టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

– ఐదుగురు కార్మికులు మృతి
– ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
– బాధిత కుటుంబాలకు 50 లక్షల పరిహారం, మరింత సహకారానికి హామీ

శ్రీసిటీ, అక్టోబర్ 03, గరుడధాత్రి :

శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం జరిగిన విషాదకర బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. షిఫ్ట్ మార్పు సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా ముందు రోజు సెలవు కావడంతో పరిశ్రమలో ఆ సమయంలో అతి తక్కువ సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌరబ్ రాయ్, చిన్న మస్తాన్ (చెరివి, సత్యవేడు మండలం), వాసు (తడ), రమేష్ (మాదరపాక్కం), మోహన్ (నాయుడుకుప్పం) మృతి చెందారు. ఇందులో నలుగురు ప్రమాద స్థలంలోనే మృతిచెందగా, వాసు తీవ్ర గాయాలతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ..

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర స్పందన బృందాలు, స్థానిక అధికారులు, కంపెనీ ప్రతినిధులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఘటనపై ప్రాధమికంగా కేసు నమోదు చేశామని, వివిధ కోణాలలో సమగ్ర దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. అంత్యక్రియలు, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పారు.

టీఐఎల్ హెల్త్‌కేర్ డైరెక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన సహచరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత 17 సంవత్సరాలుగా శ్రీసిటీలో టీఐఎల్ హెల్త్‌కేర్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని, భద్రతా ప్రమాణాలు, నిబంధనలకు సంస్థ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వం, సంబంధిత అన్ని విభాగాలు చేపట్టే దర్యాప్తుకు సంస్థ పూర్తిగా సహకరిస్తుందని అజయ్ కుమార్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ఉద్యోగుల కుటుంబాలకు అవసరమైన అన్ని విధాలా సహాయం అందించడం తమ తక్షణ ప్రాధాన్యమని చెప్పారు. భవిష్యత్తులోనూ తమ కార్యకలాపాల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాలను కొనసాగిస్తామని వెల్లడించారు.

శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన శ్రీసిటీ సమాజం మొత్తానికి ఎంతో బాధాకరమన్నారు. శ్రీసిటీ 18 ఏళ్ల ప్రస్థానంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన బాయిలర్ ప్రమాదం అనంతరం ఇక్కడ పరిశ్రమలలో సమగ్ర భద్రతా ఆడిట్‌లు నిర్వహించడంతో పాటు, భద్రతా ప్రమాణాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని, అయినా ఈ ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన ప్రతి సహాయం అందేలా కంపెనీ, అధికారులతో కలిసి మా బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!