ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సమాచార హక్కు చట్టంపై రెవెన్యూ అధికారులకు అవగాహన అవసరం

సమాచార హక్కు చట్టంపై రెవెన్యూ అధికారులకు అవగాహన అవసరం

📰 Generate e-Paper Clip

బత్తలవల్లం దళితుల సీలింగ్ భూముల ఆక్రమణ వ్యవహారంలో ఆలస్యమైన అప్పీల్ ప్రక్రియపై బాధితుల ఆవేదన

రెండో అప్పీల్‌తో రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించిన అర్జీదారులు

నిర్లక్ష్యం పై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక

సత్యవేడు, ఆగస్టు 04 గరుడధాత్రి :

సమాచార హక్కు చట్టం–2005, ఆర్టీఐ యాక్ట్ అమలులో రెవెన్యూ శాఖ అధికారులకు మరింత అవగాహన, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి అవసరమనే అభిప్రాయం మరోసారి వ్యక్తమైంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం గ్రామానికి చెందిన దళితుల సీలింగ్ భూముల వ్యవహారంలో సమాచార హక్కు చట్టం 2005 కింద దాఖలు చేసిన దరఖాస్తుకు సంబంధించి నిర్ణీత గడువులో స్పందన లేకపోవడంతో బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో జరిగిన మొదటి అప్పీల్ విచారణలో కూడా పూర్తి స్థాయి సమాచారం అందకపోవడంతో అర్జీదారు నార్నె వెంకటసుబ్బయ్య తరపున హాజరైన కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ రాష్ట్ర ప్రతినిధి జి శిరీష్ బాబుతో పాటు బాధితులు చంద్రశేఖర్, రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టం నిర్దేశించిన గడువులు దాటిపోయిన నేపథ్యంలో రెండో అప్పీల్ కోసం రాష్ట్ర సమాచార కమిషనర్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు.
బత్తలవల్లం గ్రామ దళితులకు చెందిన సీలింగ్ భూములు స్వాధీనం అయ్యాయా? కాలేదా? అనే అంశంపై స్పష్టమైన రికార్డులు, సంబంధిత పత్రాల నకళ్లు ఇవ్వాలని పలుమార్లు కోరినా, అధికారుల నుంచి తగిన స్పందన రాలేదని వారు ఆరోపించారు. ఫలితంగా సమస్య పరిష్కారం కాకుండా మరింత జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ శాఖలో తరచూ అధికారులు బదిలీ అవుతుండటంతో ప్రతి కొత్త అధికారి మొదటి నుంచి వ్యవహారాన్ని పరిశీలించాల్సి వస్తోందని, దీంతో వాస్తవ పరిస్థితులు పక్కదారి పడుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఒక అధికారి ప్రారంభించిన ప్రక్రియను మరొక అధికారి కొనసాగించకపోవడం వల్ల ప్రజలకు న్యాయం ఆలస్యం అవుతోందని అన్నారు.
సమాచార హక్కు చట్టం ప్రజలకు పారదర్శక పాలనను అందించేందుకు రూపొందించిన శక్తివంతమైన చట్టమని, అయితే దానిని అమలు చేసే అధికారులకు చట్టంపై పూర్తి అవగాహన లేకపోతే ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
దళితుల సీలింగ్ భూముల సమస్యను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై అవసరమైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయిస్తామని అర్జీదారు నార్నె వెంకటసుబ్బయ్య స్పష్టం చేశారు. బాధ్యతలను విస్మరిస్తూ సమస్యలను నీరుగార్చే విధానాన్ని సహించబోమని, చట్టబద్ధంగా తమ హక్కుల కోసం చివరివరకు పోరాడుతామని ఆయన తెలిపారు.
ఈ ఘటన సమాచార హక్కు చట్టం అమలులో సమయపాలన, పారదర్శకత, అధికారుల బాధ్యత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తోందని ప్రజా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు RTI చట్టంపై ప్రత్యేక శిక్షణ పొందడంతో పాటు, అప్పీళ్లను నిర్ణీత గడువులో పరిష్కరించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డీవీఎంసీ మెంబెర్,సీసీఆర్ రాష్ట్ర కార్యదర్శి, దేవాంగ అభ్యుదయ సేవా సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ గుత్తి త్యాగరాజు సూచించారు.ఎస్ సి, ఎస్ టి సమస్యల పరిష్కారం కోసం డీవీఎంసీ కృషి చేస్తున్న విషయాన్ని గుర్తుకు తెచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!