జనసేన వ్యూహరచన : బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం.. ఎన్నికలపై కీలక భేటీ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీ తిరుపతి వేదికగా రాజకీయ వ్యూహరచన మొదలుపెట్టింది. శనివారం తిరుపతిలోని ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్‌లో మాజీ మంత్రి, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ అత్యంత కీలక సమావేశం నిర్వహించారు.
ముందుగా, స్థానిక సంస్థల డీ-లిమిటేషన్ (పునర్విభజన) అంశంపై చర్చించేందుకు తిరుపతికి విచ్చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన నాయకులు షేక్ మాభాషా, చేని సూరి తదితరులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలతో సన్మానించి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం జరిగిన పార్టీ సమావేశంలో అధిష్టానం ఆదేశాల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన అధ్యయనం వంటి ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోయే ఆశావహులు, వీర మహిళలు, జనసైనికులు మరియు పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
