నదిలో అడ్డంగా రోడ్లు వేసి ఇసుక, గ్రావెల్ తరలింపు.. నీటి ప్రవాహానికి తీవ్ర ముప్పు
–
– కూటమి ప్రభుత్వంలో యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ: వైఎస్సార్‌సీపీ నేతలు
–
– ప్రశ్నిస్తే అరెస్టులా?అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
–
-తక్షణమే విచారణ జరిపి అక్రమ తవ్వకాలను అరికట్టాలని డిమాండ్
–
గరుడ ధాత్రి నాయుడుపేట ఆగస్టు 19:
నాయుడుపేట పట్టణ పరిధిలోని స్వర్ణముఖి నది తీరంలో పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని, కేవలం సహజ వనరుల దోపిడీ మాత్రమే రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు.
*24 గంటలూ సాగుతున్న ఇసుక, గ్రావెల్ దోపిడీ:
నాయుడుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ.. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ముఖ్యంగా నాయుడుపేట బీడీ కాలనీ సమీపంలోని స్వర్ణముఖి నదిలో గ్రావెల్, రబ్బిష్‌తో అక్రమంగా రహదారిని నిర్మించి, దానికి ఇరువైపులా భారీ యంత్రాలతో 24 గంటలూ ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒకవైపు ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా, మరోవైపు బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని మండిపడ్డారు.
*తాగునీటి వ్యవస్థకు, భూగర్భ జలాలకు ముప్పు:
నదిలో అడ్డంగా రోడ్లు నిర్మించడం వల్ల నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని, దీనివల్ల భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వర్ణముఖి నది ద్వారా నాయుడుపేట, సూళ్లూరుపేటతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే రాబోయే రోజుల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి తలెత్తుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా నదిలో తవ్విన భారీ గుంతల్లో నీరు నిలవడం వల్ల సమీప కాలనీల చిన్న పిల్లలకు, పశువులకు ప్రాణసంకటంగా మారిందన్నారు.
*బాధ్యులపై చర్యలేవి? ప్రశ్నిస్తే అక్రమ కేసులు:
ఇసుక దోపిడీపై స్థానిక రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తే వారిపైనే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయిస్తున్నారే తప్ప, అక్రమ తవ్వకాలను మాత్రం అరికట్టడం లేదని విమర్శించారు. పత్రికలు, మీడియా ద్వారా అనేకసార్లు ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చినా, స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ, డీఎస్పీ, సీఐ, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు స్వయంగా ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.స్వర్ణముఖి నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాలపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నదిలో అడ్డంగా నిర్మించిన అక్రమ రహదారులను వెంటనే తొలగించి సహజ నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, చదలవాడ కుమార్, జలదంకి వెంకటకృష్ణారెడ్డి, షేక్ షబీర్, పట్టణ కార్యదర్శి పేర్నాటి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
