!
‘వన్మంత్-వన్విలేజ్-ఫోర్విజిట్స్’ లో భాగంగా ముచ్చలగుంటలో కార్యక్రమాలు.. తల్లంపాడులో ఎలక్షన్ విధుల పరిశీలన!
పాలన పారదర్శకంగా ఉండాలి.. సచివాలయ సిబ్బందికి తహసీల్దార్ ఆదేశం
దొరవారిసత్రం, జూలై 23 (గరుడ దాత్రి):
మండలంలో పాలనను మరింత వేగవంతం చేస్తూ, ప్రజలకు సేవలను వేగంగా అందించడమే లక్ష్యంగా దొరవారిసత్రం మండల తహసీల్దార్ రాజేంద్ర పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. మండల పరిధిలోని ముచ్చలగుంట, పోలిరెడ్డిపాలెం, తల్లంపాడు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి పలు శాఖల పనితీరును, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముచ్చలగుంటలో ‘వన్మంత్-వన్విలేజ్-ఫోర్విజిట్స్’:
ప్రభుత్వ ఆదేశాల మేరకు ముచ్చలగుంట గ్రామంలో ‘వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్’ (నెలకో గ్రామం – నాలుగు పర్యటనలు) కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ రాజేంద్ర పర్యటించారు. గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు రెవెన్యూ, సచివాలయ సేవల అమలు తీరుపై సమీక్షించారు.
పోలిరెడ్డిపాలెం, తల్లంపాడు సచివాలయాల తనిఖీ
అనంతరం పోలిరెడ్డిపాలెం మరియు తల్లంపాడు గ్రామ సచివాలయాలను తహసీల్దార్ రాజేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. తల్లంపాడు సచివాలయంలో చేపడుతున్న ఎలక్షన్ విధులు, ఓటర్ల నమోదు/సవరణ రికార్డులను ఆయన నేరుగా పరిశీలించి సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు, అటెండెన్స్ రిజిస్టర్లు, ప్రజా వినతుల పరిష్కార రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి:
ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేంద్ర మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరవుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజా వినతులకు ప్రాధాన్యతనిచ్చి, నిర్దేశిత సమయంలో సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎలక్షన్ సంబంధించిన పనులను అత్యంత పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో స్థానిక రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
