గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి*
గ్రీన్ అంబాసిడర్ లకు అదనపు ఆదాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి
, —రాష్ట్ర పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ సుధాకర్ రావు
చిత్తూరు, జూలై 29,(గరుడ దాత్రి న్యూస్) చెత్తను సంపదగా మార్చి గ్రామాల పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడాలని, గ్రీన్ అంబాసిడర్ లకు అదనపు ఆదాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలనిపంచాయతీరాజ్ అదనపు కమిషనర్ సుధాకర్ రావు తెలిపారు.
బుధవారం చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలోఘన వ్యర్థాల నిర్వహణనిబంధనలు–2026 అమలు, గ్రామ పంచాయతీలలో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల (ఎస్‌డబ్ల్యూపీసీ) సమర్థ నిర్వహణపైపంచాయతీరాజ్ అదనపు కమిషనర్ సుధాకర్ రావు జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు,జిల్లాపంచాయతీ అధికారి (డీపీఓ)సుధాకర్ లతో కలిసి సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాల ప్రధాన లక్ష్యం చెత్తను సంపదగా మార్చడంతోపాటుప్రజారోగ్యాన్ని కాపాడటమేనని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 2.50 లక్షల కుటుంబాలు, 12 లక్షల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ అత్యంత అవసరమని చెప్పారు.పశువుల నుంచి వచ్చే పేడను రైతుల సహకారంతో సేకరించి వర్మీ కంపోస్టుగా తయారు చేసే విధానాన్ని గ్రామ స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ఇంటింటి నుంచి సేకరించే తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేయించి, తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేయాలని, పొడి చెత్తను గ్రామంలో నిల్వ ఉంచి స్వచ్ఛ రథాల ద్వారా విక్రయించే విధానం అమలు చేయాలన్నారు.పొడి చెత్తను బయట పారేయకుండా దానికి ఆర్థిక విలువ కల్పించడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత పెరగడంతో పాటు, ఇంటి పన్ను క్రమం తప్పకుండా చెల్లించే కుటుంబాలకు వార్షికంగా కనీసం 50 శాతం వరకు ప్రోత్సాహకంగా తిరిగి అందించే విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలనిసూచించారు.
గ్రీన్ అంబాసిడర్ లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వారికి అదనంగా రూ.5,000 వరకు ఆదాయం వచ్చేలా మార్గాలనుఅన్వేషించాలని, స్వచ్ఛ రథాలనిర్వహకులకు కూడా పొడి చెత్త విలువపై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు.
శానిటరీ వ్యర్థాలు, డైపర్లు, మహిళల పరిశుభ్రతకు సంబంధించిన వ్యర్థాలతో పాటు మొత్తం 29 రకాల పొడి చెత్తను వర్గీకరించి వాటికి ప్రత్యేక ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొద్ది రకాల వ్యర్థాలనే సేకరిస్తున్న స్వచ్ఛ రథాల నిర్వహకులు మిగిలిన విలువైన పొడి చెత్తను కూడా సేకరించేలా అవగాహన కల్పించాలని సూచించారు.జిల్లా పరిషత్ సీఈవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.2018లో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామపంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇంటింటికీ చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరు చేయడం, శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం వంటి కార్యక్రమాలుప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వంఈకార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ఈ-ఆటోలు, స్వచ్ఛ రథాలు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
ప్రతి నెల ఐవీఆర్‌ఎస్ ద్వారాప్రజలఅభిప్రాయాలను సేకరించి సేవలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఈ-ఆటోలు అందించడంతో పాటు, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అధిక ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలకు వందకు పైగా చెత్త సేకరణ వాహనాలు అందించామని తెలిపారు. దీంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిశుభ్రత ర్యాంకింగ్‌లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.
గతంలో గ్రీన్ అంబాసిడర్ లకు నెలల తరబడి వేతనాలు అందని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుందని తెలిపారు. గ్రామాలు పరిశుభ్రంగా, అందంగా కనిపించేలా ప్రజల్లో అవగాహనపెంపొందించడం అత్యంత అవసరమని, ఒక్కరోజులో మార్పు రాదని, క్రమంగా ప్రజల్లో పరిశుభ్రతపై బాధ్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది అని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి, టమాటా సీజన్‌లో రహదారుల పక్కన వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ అధికారులు నిరంతరం చర్యలు చేపడుతున్నారని తెలిపారు.పంచాయతీ సిబ్బంది, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులకు నిరంతరం శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. “స్వచ్ఛ పథం”, “స్వచ్ఛ రథం” వంటి కార్యక్రమాల ద్వారా రహదారుల వెంట పేరుకుపోయే చెత్తను తొలగించడం, పొడి చెత్తను సేకరించడంజరుగుతోందన్నారు. ఈ చర్యల ఫలితంగా రాష్ట్ర స్థాయిలో పరిశుభ్రత ర్యాంకింగ్‌లో జిల్లా ఎనిమిదో స్థానానికి చేరుకుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఎల్ డి ఓ లు, ఎంపీడీఓ లు, పంచాయతీసెక్రటరీలు,డిప్యూటీ ఏం.పి.డి.ఓ లు, విలేజ్ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.
