పలమనేరు, ఆగస్టు 02 ( గరుడ ధాత్రి ) :
“సమాజం మేలుకోరేదే మంచి సాహిత్యం. అటువంటి సాహిత్యం సమాజ అభ్యున్నతికి దోహదపడటంతో పాటు మానవ వికాసానికి పునాదిగా నిలుస్తుంది” అని ప్రముఖ కవి చలంకోట బురుజు మునస్వామి పేర్కొన్నారు. స్థానిక కళామందిరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ప్రముఖ కవి, భాషా సేవకులు ఉప్పల ధడియం రామమూర్తి స్మారక పురస్కారాన్ని ఆయన అందుకెళ్లారు. పురస్కారంతో పాటు రూ. 10,000 నగదు బహుమతిని నిర్వాహకులు ఆయనకు బహుకరించారు.ఈ సందర్భంగా అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ ఉప్పల ధడియం వెంకటేశ్వర, ఉప్పల ధడియం నాగేశ్వర మాట్లాడుతూ… తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే ప్రవచనాలను చలంకోట బురుజు మునిస్వామి వెలువరించారని కొనియాడారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై పూర్తి అవగాహనతో రచనలు చేస్తున్న ఆయన నిరంతర సాహిత్య కృషిని గౌరవిస్తూ ఈ పురస్కారాన్ని అందజేసినట్లు తెలిపారు. తులసినాథం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ అవధాని మల్లెల నాగరాజు పురస్కార గ్రహీతను సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కార్యదర్శి పుష్ప, పలమనేరు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు ఆర్. మాధవ్, అధ్యక్షులు పలమనేరు బాలాజీ, సమన్వయకర్త జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, సాహితీవేత్తలు మరియు ప్రముఖులు టి. ఎస్. ఏ. కృష్ణమూర్తి, కరణం విద్యాసాగర్, మాలేపట్టు పురుషోత్తమాచారి, గిరిధర మూర్తి, దోర్నాదుల సిద్ధార్థ, డా. ఎస్. చంద్రశేఖర్, చంద్రశేఖరయ్య, శ్రీపురం సీతారామయ్య,హరివిల్లు సంస్థ నిర్వాహకులు వల్లేరు హరినాయుడు, భాస్కర రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
