పిచ్చాటూరు, ఆగస్టు 4 గరుడధాత్రి:
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పిచ్చాటూరు, వెంగళత్తూరు గ్రామాల అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల్లో భాగంగా సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు సూపర్వైజర్లు సుమతి, కల్పలత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే తల్లి పాలను పట్టించాలని సూచించారు. పుట్టిన వెంటనే వచ్చే “ముర్రుపాలు” శిశువుకు అత్యంత పోషకమైనవని, ఇందులో ఉండే ఇమ్యూనోగ్లోబులిన్-ఏ యాంటీబాడీలు శిశువులో రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షిస్తాయని వివరించారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుకు అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా అందడంతో పాటు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. అలాగే తల్లులకు బరువు తగ్గడం, మానసిక ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలతో పాటు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కోమల, భారతి, ఆముద, షఫియా, జ్యోతి, రూత్ మేరీ, మునిరత్న, సంగీత, హెల్పర్లు, జీఎంఎస్‌కే సభ్యురాలు కైరూం బీ, గర్భిణులు, బాలింతలు, తల్లులు పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పొందారు.
