ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కరువు నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించి రైతులకు న్యాయం చేయాలి

కరువు నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించి రైతులకు న్యాయం చేయాలి

📰 Generate e-Paper Clip

సత్యవేడులో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా

సత్యవేడు, సెప్టెంబర్ 23 గరుడధాత్రి:

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరువు నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్ చేసింది.
ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు సత్యవేడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దేశాండీ అరుణాచలం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సంఘం తీసుకున్న నిర్ణయంలో భాగంగా సత్యవేడులో ధర్నా చేపట్టినట్లు తెలిపారు.
ధర్నా అనంతరం సంఘం ప్రతినిధులు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సామాజిక పింఛన్ల గడువును అక్టోబర్ 8 వరకు కొనసాగించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని కోరారు.
50 ఏళ్లు పూర్తైన డప్పు కళాకారులకు పింఛన్ మంజూరు చేస్తామని ఉన్న జీవో ప్రకారం అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ 200 రోజుల పని కల్పించి, రోజువారీ కూలీని రూ.600కు పెంచాలని, రెండు పూటలా ఫొటో విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
వర్షాభావం, కరువు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా గుర్తించి అధికారికంగా ప్రకటించాలని, పంట నష్టాన్ని అంచనా వేసి రైతులు, కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించాలని కోరారు.
కరువు నివారణ చర్యల్లో భాగంగా బియ్యంతో పాటు 16 రకాల నిత్యావసర సరుకులను రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా లేదా సబ్సిడీపై అందించాలని, చేతివృత్తిదారుల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం, దాణా అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించేలా వ్యవసాయ అనుబంధ, ఆహార శుద్ధి, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ ధర్నాలో ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ సభ్యులు ధనుంజయులు, రవి, కుమార్, అన్బు, ఆశీర్వాదం, వెంకటేశ్, చుక్కలింగం, కుప్పయ్య తదితరులతో పాటు సిరణం, బుదురు, మదనంబేడు, వానెల్లూరు ప్రాంతాలకు చెందిన రైతు కూలీలు, డప్పు కళాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!