ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచిత్తూరును కరువు జిల్లాగా ప్రకటించాలి : ఏఐకేఎంఎస్ రైతు సంఘం డిమాండ్

చిత్తూరును కరువు జిల్లాగా ప్రకటించాలి : ఏఐకేఎంఎస్ రైతు సంఘం డిమాండ్

📰 Generate e-Paper Clip

పలమనేరు, సెప్టెంబర్ 23 ( గరుడ ధాత్రి ) :
ఎల్-నినో ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన చిత్తూరు జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభల పిలుపుమేరకు పలమనేరు మండల కేంద్రంలో తహశీల్దార్‌కు బుధవారం ఆయన ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ… వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయంపై ఆధారపడిన రైతులు అప్పులపాలై తీవ్రంగా సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

రైతు సంఘం ప్రధాన డిమాండ్లు ఇవే :

చిత్తూరును కరువు జిల్లాగా ప్రకటించి, ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి. పాత పంట రుణాలు పూర్తిగా మాఫీ చేసి, కొత్త రుణాలు మంజూరు చేయాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు 100% సబ్సిడీతో ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న మామిడి, కొబ్బరి చెట్లకు రూ.3,000, ఇతర ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.50,000 చొప్పున పరిహారం చెల్లించాలి. పంటల బీమా పథకంలో మామిడి, కొబ్బరి తదితర ఉద్యానవన పంటలను చేర్చాలన్నారు. హంద్రీ-నీవా జలాలను కాలువల ద్వారా చెరువులు, కుంటలకు మళ్లించాలి. కౌండిన్యా నదిపై పెండింగ్ ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు పూర్తి చేసి, అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలి. మెట్ట భూములకు ‘ఎన్టీఆర్ జలకళ’ కింద ఉచిత బోర్లు వేయాలి. జిల్లా వ్యాప్తంగా పశుగ్రాస కేంద్రాలు, నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి, పని దినాలు, వేతనాలు పెంచాలి. ఏనుగుల దాడుల నివారణకు అటవీ ప్రాంతాల్లో, రైతుల పొలాల వద్ద 100% సబ్సిడీతో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి 1B, అడంగల్ హక్కులు కల్పించాలన్నారు. అర్హులైన పేద రైతులకు ఇళ్లు, పెన్షన్ మంజూరు చేయడంతో పాటు ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కోశాధికారి వాసు, రైతు నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, రవీంద్రారెడ్డి, హరి, లక్ష్మీపతి నాయుడు, వాసుదేవ రెడ్డి, మురుగేష్ నాయుడు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!