-ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం డిమాండ్
పిచ్చాటూరు సెప్టెంబర్ 27 గరుడధాత్రి :
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని ఎనిమిది సహకార రంగంలో ఉన్న చక్కెర పరిశ్రమలను అమ్మడానికి తెచ్చిన జీవో నంబర్ 250ని తక్షణమే రద్దుచేసి మూతబడిన పరిశ్రమలను తెరిపించి రైతులకు న్యాయం చేయాలని చెరుకు రైతుల సంఘం ఆల్ ఇండియా కమిటీ సభ్యులు దాసరి జనార్ధన్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులను ఉద్ధరిస్తామని, రైతులను ఆదుకుంటున్నామని ఊక దంపుడు ప్రసంగాలు చేస్తున్నారు కానీ, మరోవైపు రైతులకు నష్టం కలిగేలా సహకార రంగంలో ఉన్న ఎనిమిది చక్కర పరిశ్రమలను ప్రైవేటీకరించడానికి లేదా అమ్మడానికి జీవో నెంబర్ 250 ను తీసుకురావడం దారుణమన్నారు. తక్షణమే రాష్ట్రప్రభుత్వం జీవో నెంబర్ 250ను రద్దుచేసి మూతబడిన సహకార పరిశ్రమలను తెరిపించి చెరుకు రైతులకు ప్రోత్సాహక ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు .
మహారాష్ట్ర, కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలలో చెరుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే అదనంగా ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి 300 రూపాయల నుంచి 600 రూపాయల వరకు టన్నుకు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ విధానం ద్వారా చెరుకు రైతులకు ఆయా రాష్ట్రాలలో లాభసాటిగా ఉన్నందున దేశంలో గణనీయంగా చక్కెర ఉత్పత్తి చేస్తున్నారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న చక్కెర పరిశ్రమలను ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో రైతులకు ఇస్తున్న సలహా ధరను ప్రోత్సాహక ధరను పూర్తిగా రద్దు చేసి కేవలం పరిశ్రమలపైనే వదిలేయడం వల్ల రైతులకు ధర గిట్టుబాటు కాక పెట్టుబడులు పెరిగి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .
కేంద్ర ప్రభుత్వం రికవరీ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధర తన్నుకు5500 ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రైతులు తమ కష్టంతో కోట్లాది రూపాయలు కూడగట్టి సహకార చక్కెర పరిశ్రమలను నిర్మించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విక్రయించడానికి నిర్ణయించడం దారుణమన్నారు తిరుపతి, చిత్తూరు జిల్లాలోని ఉన్న కోట్లాది రూపాయల విలువజేసే చక్కర పరిశ్రమలను కాపాడుకోవడానికి రైతులు గతంలోనే కోర్టులను ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారని గుర్తు చేశారు. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు చెరుకు రైతులు పట్ల అనుసరిస్తున్న విధానాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకోవాలని అన్నారు .సహకార రంగంలోని పరిశ్రమలను విక్రయిస్తే జిల్లాలోనే రైతులు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా హెచ్చరించారు.
