*తప్పుడు మనుషులు… తప్పుడు రాతలు*
– సాక్షి అబద్ధాలపై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు స్పందన
– వైసిపి పాలన వ్యవసాయానికి చీకటి యుగం
– కూటమి ప్రభుత్వం రైతుకు నిజమైన భరోసా
*అమరావతి, ఏప్రిల్ 26:* సాక్షి పత్రికలో వ్యవసాయం పై ప్రచురితమైన వక్రీకృత కథనాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతుల కష్టాలను కావాలనే వక్రీకరించి, ఒకటి రెండు ప్రాంతాల్లో ఉన్న సాధారణ పరిస్థితులను మొత్తం రాష్ట్రానికి వర్తింపజేసి సంక్షోభంలా చిత్రీకరించడం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన కుట్రపూరిత ప్రచారమని ఆయన మండిపడ్డారు. “కూరగాయలు రోడ్లపై పారేస్తున్నారు, రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు” అంటూ ప్రచారం చేయడం పచ్చి అబద్ధమని, ఇది వైసిపి స్క్రిప్ట్‌ను అమలు చేస్తున్న సాక్షి ప్రయత్నమని ఆయన తేల్చిచెప్పారు. 2019 నుంచి 2024 వరకు వైసిపి ప్రభుత్వం వ్యవసాయ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రైతులకు సరైన మద్దతు ధరలు కల్పించకపోవడం, మార్కెట్లో సమయానికి జోక్యం చేసుకోకపోవడం, ఇన్పుట్ సబ్సిడీల్లో తీవ్ర ఆలస్యం చేయడం వల్లే అప్పట్లో నిజంగా రైతులు పంటలు రోడ్లపై పారేయాల్సిన దుస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. రైతు సంక్షేమం పేరుతో పెద్దఎత్తున ప్రచారం చేసిన జగన్, రైతు జీవితంలో ఒక్క శాశ్వత మార్పు కూడా తీసుకురాలేకపోయారని, ఇప్పుడు అదే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సాక్షి ద్వారా అబద్ధాల ప్రచారం చేయిస్తున్నారని మంత్రి తీవ్రంగా ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుకు లాభదాయకమైన వ్యవసాయం అందించేందుకు మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ, నిల్వ సదుపాయాలు, రవాణా, ధరల స్థిరీకరణ చర్యలు సమగ్రంగా అమలు చేస్తోందని, ఆ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం లేని వారు మాత్రమే అబద్ధాల వెనుక దాక్కుంటారని, సాక్షి పత్రిక అబద్ధాల యంత్రంగా మారిందని తీవ్రంగా విమర్శిస్తూ, వెంటనే ఈ తప్పుడు ప్రచారం ఆపకపోతే రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు ప్రజలే తగిన సమాధానం ఇస్తారని మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా హెచ్చరించారు.
రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల ధరలపై “సాక్షి” పత్రిక అదే పాత, అసత్య సమాచారాన్ని పునరావృతంగా ప్రచురిస్తూ రైతులను, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉల్లి, టమోటా, అరటి, బొప్పాయి పంటలు రబీ సీజన్ ముగింపు దశలో ఉండి కోతలు దాదాపు పూర్తయ్యాయని, ఉల్లిపాయలో 3740 హెక్టార్లలో సాగు జరగగా 97 శాతం కోత పూర్తై సుమారు 3500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉండి ప్రస్తుతం కిలోకు రూ.5.80 ధర ఉండగా, టమోటాలో 12,676 హెక్టార్లలో సాగు జరిగి 8,500 హెక్టార్లలో కోత పూర్తై మిగతా ప్రాంతాల్లో కొనసాగుతూ మొత్తం 54,290 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉండి ప్రస్తుతం కిలోకు రూ.15 నుంచి రూ.21 వరకు ధరలు నమోదవుతున్నాయని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్ కమిటీలో 26-04-2026 నాటికి 276 మెట్రిక్ టన్నుల టమోటా రాగా మంచి నాణ్యతకు రూ.32-36, మధ్యస్థానికి రూ.27-31, సాధారణ నాణ్యతకు రూ.20-26 ధరలు ఉండగా, పుంగనూరు మార్కెట్లో 10 కేజీలకు గరిష్ఠంగా రూ.360, కనిష్ఠంగా రూ.214, మోడల్ ధర రూ.287గా ఉండి మొత్తం 390.10 మెట్రిక్ టన్నుల సరుకు వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో అరటి పండ్లకు ఇప్పటివరకు 85,326 నుంచి 90,210 మెట్రిక్ టన్నుల ఎగుమతులు జరగగా, యుద్ధానికి ముందు టన్నుకు రూ.20,000 నుంచి రూ.23,000 ధరలు ఉండగా ప్రస్తుతం ఫార్మ్ గేట్ వద్ద A గ్రేడ్ రూ.8-10/కిలో, B గ్రేడ్ రూ.6-8/కిలో, C గ్రేడ్ రూ.4-5/కిలో ధరలు కొనసాగుతున్నాయని, ఇంకా 93 హెక్టార్లలో కోత మిగిలి ఉండి సుమారు 1,382 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అందుబాటులో ఉందని తెలిపారు. బొప్పాయి పంటలో ఇంకా 48 హెక్టార్లలో కోత మిగిలి ఉండి సుమారు 3,210 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉండగా ప్రస్తుతం 1వ రకం రూ.7-8, 2వ రకం రూ.6-7, 3వ రకం రూ.5-6 కిలో ధరలు కొనసాగుతున్నాయని చెప్పారు. కడప జిల్లాలో అరటి పంటలో ఇంకా 1,170 హెక్టార్లలో కోత మిగిలి ఉండగా బంచ్ కట్టింగ్‌కు టన్నుకు రూ.8,000 నుంచి రూ.11,000, హ్యాండ్స్ కట్టింగ్ & బాక్సింగ్‌కు టన్నుకు రూ.12,000 నుంచి రూ.14,000 వరకు ధరలు లభిస్తున్నాయని తెలిపారు. మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే ఎక్కువ పంటలు ముగింపు దశలో ఉండటం వల్ల నాణ్యతలో మార్పులు, సరఫరాలో హెచ్చుతగ్గులు సహజమని, గతంలో తక్కువ నాణ్యత, సీజనల్ ఫ్లక్చుయేషన్స్ సమయంలో నమోదైన ధరలను ఇప్పటికీ ఉన్నట్లుగా చూపించడం పూర్తిగా తప్పుదారి పట్టించే చర్య అని మంత్రి అన్నారు. ముఖ్యంగా టమోటా ధరలు ప్రస్తుతం మంచి స్థాయిలో ఉండి సాగు వ్యయంతో పోలిస్తే రైతులకు లాభదాయకంగానే ఉన్నాయని స్పష్టం చేస్తూ రైతుల్లో భయాందోళనలు సృష్టించే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి అచ్చెన్నాయుడు గారు సూచించారు, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. కొంతమంది దళారులు కావాలనే తప్పుడు సంకేతాలు సృష్టిస్తూ పలు పత్రికల్లో తమకు అనుకూలమైన వార్తలు రాయించుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రైతుల వద్ద తక్కువ ధరకు మొక్కజొన్న, జొన్న కొనుగోలు చేసిన దళారులే కొద్ది రోజుల్లో MSP రేటుకే వాటిని అమ్ముకునే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు.
22-04-2026 నాటికి ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం కనీస మద్దతు ధరల (MSP) కంటే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వరి గ్రేడ్-ఎకు మార్కెట్ ధర రూ.2500, వరి కామన్‌కు రూ.2400గా నమోదయ్యాయి. జొన్న (హైబ్రిడ్)కు 1900-1950, జొన్న మాల్దాండి రూ.5500, రూ.5875 (AP మార్క్‌ఫెడ్), పత్తి రూ.8689-9072, మీడియంకు, రూ.6500-6700గా నమోదయ్యాయి. పసుపుకు రూ.11600-11750, మిర్చికి రూ.13500-22800 (కామన్), రూ.13500-22500 (స్పెషల్), రూ.7500-11800 (తెల్ల)గా ఉన్నాయి. ఉల్లిపాయకు రూ.1300, నిమ్మకాయలు ఎలూరు రూ.7500-11500-16000, తెనాలి రూ.8000-10000-12500, పొదలకూరు రూ.10000-14000-17000గా ఉన్నాయి. కొబ్బరికాయలో కాప్రా రూ.15500-16500, డ్రై కొబ్బరి రూ.28000-30000, గటగటా రూ.23000-25000, వాటర్ కొబ్బరి రూ.15000-17000గా నమోదయ్యాయి. ఈ గణాంకాలన్నింటిని పరిశీలిస్తే రైతులకు MSP కంటే మెరుగైన ధరలు లభిస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు.
