‘పది’లో ప్రతిభ చూపిన బాలికలకు శ్రీసిటీలో సత్కారం
గరుడధాత్రి న్యూస్ :
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన శ్రీసిటీ పరిసర ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థినులను శ్రీసిటీ తరుపున ఘనంగా సత్కరించారు. స్థానిక బిజినెస్ సెంటర్ లో శ్రీసిటీ డైరెక్టర్ (సి ఎస్ ఆర్) నిరీషా సన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో చిన్మయ మిషన్‌కు చెందిన హెచ్.హెచ్. స్వామి మిత్రానందజీ, ఇతర స్వామీజీలు చేతుల మీదుగా విద్యార్థినులకు నగదు బహుమతులు, జ్ఞాపికలను అందజేసి వారి విద్యా ప్రతిభను, పట్టుదలను అభినందించారు.
వీరిలో వరదయ్యపాలెం జెడ్‌పీ హైస్కూల్‌కు చెందిన ఎస్.దిషిత సాయి 595 మార్కులతో తిరుపతి జిల్లా ప్రథమ ర్యాంకు, రాష్ట్ర ద్వితీయ ర్యాంకు సాధించిది. ఈ బాలిక తల్లితండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. అదే పాఠశాలకు చెందిన కె.రేఖ 591 మార్కులతో జిల్లా తృతీయ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి వడ్రంగి జీవనం సాగిస్తున్నారు. శ్రీసిటీ పరిధిలోని మాదనపాలెం జెడ్‌పీ హైస్కూల్ విద్యార్థిని బి.కీర్తన 584 మార్కులతో సత్యవేడు మండల టాపర్‌గా నిలిచింది. ఈ విద్యార్థిని తల్లి శ్రీసిటీ పరిశ్రమలో పనిచేస్తుండగా, తండ్రి ప్రవేట్ ఉద్యోగి. ఇక బిహార్‌కు చెందిన బందనా 584 మార్కులతో సుళ్లూరుపేట జెడ్‌పీ బాలికల పాఠశాలలో ప్రథమ స్థానం సాధించింది. ఈమె తండ్రి శ్రీసిటీ పెప్సీ పరిశ్రమలో చిరుద్యోగి.
ఈ సత్కారం ద్వారా వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తూ, విద్యా ప్రావీణ్యాన్ని పెంపొందించాలన్న శ్రీసిటీ సంకల్పం ప్రతిఫలించింది. ఈ ప్రతిభావంతులను గౌరవించడం ద్వారా భావితరాలను సాధికారత దిశగా నడిపిస్తూ, అభ్యాసం మరియు ఉన్నత ఆశయాల సంస్కృతిని ప్రోత్సహించడంలో శ్రీసిటీ తన నిబద్ధతను మరొకసారి చాటుకుంది.
