శ్రీసిటీలో చిన్మయ అమృత మహోత్సవ్ వేడుకలు
– మానవ విలువలు, సమర్థ నాయకత్వం, భగవద్గీత ప్రాధాన్యతపై స్వామి మిత్రానంద స్ఫూర్తిదాయక ప్రసంగం
గరుడధాత్రి న్యూస్ :
చిన్మయ మిషన్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “చిన్మయ అమృత మహోత్సవ్” వేడుకలలో భాగంగా శ్రీసిటీలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు విచ్చేసిన చెన్నై & నార్త్ ఈస్ట్ చిన్మయ మిషన్ రెసిడెంట్ ఆచార్యులు స్వామి మిత్రానందకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. మిత్రానందతో పాటు కొయంబత్తూరులోని చిన్మయ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ రెసిడెంట్ డైరెక్టర్ స్వామి అనుకూలానంద, కడప చిన్మయ మిషన్ అధ్యక్షులు స్వామి తురీయానంద, గుంటూరు & విశాఖపట్నం చిన్మయ మిషన్ ఇన్చార్జ్ స్వామి సువీరానంద కు ఆయన ఆహ్వానం పలికారు.
డా. రవీంద్ర సన్నారెడ్డి తన స్వాగత ప్రసంగంలో దేశ నిర్మాణం, విలువల ఆధారిత విద్య, యువత సాధికారతకు చిన్మయ మిషన్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. అమృత యాత్రలో భాగంగా తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన అనంతరం తొలి గమ్యస్థానంగా శ్రీసిటీని ఎంపిక చేసినందుకు స్వామి మిత్రానందకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పరిశ్రమల ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, చిన్మయ మిషన్ సభ్యులు సమక్షంలో శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో “బ్యాటిల్‌ఫీల్డ్ టు బోర్డ్‌రూమ్” అంశంపై హెచ్.హెచ్. స్వామి మిత్రానంద సరస్వతి ప్రేరణాత్మక ఉపన్యాసం చేశారు. భగవద్గీత బోధనలను ఆధునిక కార్పొరేట్ నాయకత్వంతో అనుసంధానిస్తూ వ్యూహాత్మక స్పష్టత, నైతిక నిర్ణయాలు, భావోద్వేగ సమతుల్యత, సహనశక్తి నేటి వృత్తి జీవితంలో ఎంత ముఖ్యమో వివరించారు. వేదాంత జ్ఞానం వ్యాపార నాయకత్వానికి, వ్యక్తిగత జీవితానికి విలువైన మార్గదర్శకత్వం అందిస్తుందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అమృత యాత్ర ముఖ్య ఉద్దేశ్యం మరియు యాత్రా ప్రణాళికను స్వామి అనుకూలానంద సంక్షిప్తంగా వివరించారు. ఆధ్యాత్మికత, జీవిత విలువలు, శ్రీమద్భగవద్గీత సారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రత్యక్షంగా 1.95 లక్షల మందికి పైగా ప్రజలతో అనుసంధానం కావడం ఈ యాత్ర లక్ష్యమని తెలిపారు. స్వామి తురీయానంద భగవద్గీత యొక్క నిత్యజీవిత ప్రాముఖ్యతపై ప్రసంగిస్తూ, ఫలితంపై ఆసక్తి లేకుండా నిజాయితీతో, అంకితభావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఎంతో ముఖ్యమని వివరించారు.
ఆకట్టుకున్న మొబైల్ ఎగ్జిబిషన్ ‘టెంపుల్ఆన్ వీల్స్’
తమిళనాడు నుంచి ఆంధ్రలో ప్రవేశించిన చిన్మయ అమృత్ యాత్ర వాహనానికి తొలుత చిన్మయ విద్యాలయ సీనియర్ సెకండరీ స్కూల్ యాజమాన్యం, తరువాత బిజినెస్ సెంటర్ వద్ద శ్రీసిటీ కమ్యూనిటీ ఘన స్వాగతం పలికారు. వాహనంలో ఏర్పాటు చేసిన స్వామి చిన్మయానందకు సంబంధించిన పవిత్ర వస్తువులు, జ్ఞాపికలను విద్యార్థులు దర్శించారు. ఈ యాత్ర ద్వారా భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంపై విద్యార్థులకు అవగాహన కలిగించడంతో పాటు స్వామి చిన్మయానంద జీవిత స్ఫూర్తిని పరిచయం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి భువనేశ్వరి తెలిపారు.
