ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితొందరపడి వరి వేయొద్దు

తొందరపడి వరి వేయొద్దు

📰 Generate e-Paper Clip

జూన్‌లో కురిసే తొలకరి వర్షాలను చూసి రైతులు తొందరపడి వరి సాగుకు వెళ్లొద్దు. నీటి లభ్యతపై స్పష్టత వచ్చిన తర్వాతే సాగు చేయాల్సిన పంటలను ఎంపిక చేసుకోవాలి’ *-క్రిడా (సీఆర్‌ఐడీఏ) ప్రధాన శాస్త్రవేత్త కేవీ రావు సూచించారు.*
— తొందరపడి వరి వేయొద్దు
— జూన్‌ వర్షాలను చూసి దీర్ఘకాలిక పంటలు వద్దు
— జూలై, ఆగస్టులో మధ్యంతర కరువు ముప్పు
— ఎల్‌నినోపై క్రిడా శాస్త్రవేత్త కేవీ రావు హెచ్చరిక

‘జూన్‌లో కురిసే తొలకరి వర్షాలను చూసి రైతులు తొందరపడి వరి సాగుకు వెళ్లొద్దు. నీటి లభ్యతపై స్పష్టత వచ్చిన తర్వాతే సాగు చేయాల్సిన పంటలను ఎంపిక చేసుకోవాలి’ అని *క్రిడా (సీఆర్‌ఐడీఏ) ప్రధాన శాస్త్రవేత్త కేవీ రావు* సూచించారు. జూలై, ఆగస్టు నెలల్లో మధ్యంతర కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున అధిక నీరు అవసరమయ్యే దీర్ఘకాలిక వరి రకాల సాగుపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన ‘2026లో ఎల్‌నినో సంభవిస్తుందన్న వాతావరణ సూచన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వర్క్‌షా్‌ప’లో ఆయన ముఖ్యోపన్యాసం చేశారు. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని, అయితే సాధారణ వర్షాలు కురుస్తాయని భావించి రైతులు నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి వంటి పంటలను ఎక్కువగా సాగు చేయడం ప్రమాదకరమని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కూడా సాగునీరు అందుబాటులో ఉంటుందన్న పూర్తి భరోసా ఉన్నప్పుడే వరి సాగుకు వెళ్లాలని, లేకపోతే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని చెప్పారు. ఉపకులపతి పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురయ్యే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వర్క్‌షా్‌పలో వచ్చిన సూచనలు, శాస్త్రవేత్తల సిఫార్సులను జిల్లాల వారీగా క్రోడీకరించి వ్యవసాయ శాఖ, డీఏఏటీటీ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు అందజేస్తామని చెప్పారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేస్తే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. వర్క్‌షాప్ లో రాష్ట్రంలోని ఐదు వ్యవసాయ-వాతావరణ మండలాలకు సంబంధించిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను శాస్త్రవేత్తలు వివరించారు. కరువును తట్టుకునే పంట రకాలు, ఆలస్య వర్షాలకు అనువైన పంటలు, నీటి పొదుపు సాగు విధానాలపై సూచనలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!