-వచ్చే నెల నుంచి దశలవారీగా పరుగులు
అమరావతి గరుడధాత్రి : ఆర్టీసీలో కాలం చెల్లిన, ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. దశలవారీగా మొత్తం 6వేల బస్సులు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, ఇందులో విద్యుత్ బస్సులు 5,500, సీఎన్జ బస్సులు 500 ఉంటాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సిటీ బస్సుల్లో కాలం చెల్లినవి ఏవేవి ఉన్నాయో, వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అవే సర్వీసులుగా నడపనున్నారు.
-జులై నుంచి మొదలు…
ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సులు రాష్ట్రానికి కేటాయించారు. వీటిని 11 నగరాల్లోని 12 డిపోల పరిధిలో అద్దె ప్రాతిపదికన నడుపుతారు. వీటిలో 300 బస్సులు జులైలో రోడ్డెక్కనున్నాయి. ఆగస్టులో మిగిలిన 450 రానున్నాయి.
తిరుమల ఘాట్లో డీజిల్ బస్సుల స్థానంలో నడిపేందుకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి 300 విద్యుత్ బస్సులు మంత్రిత్వశాఖ మంజూరుచేసింది. ఇతర నగరాల్లో తీసుకునే విద్యుత్ బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉండగా, ఘాట్లో నడిపేవి 9 మీటర్ల పొడవుతోనే ఉంటాయి. వీటికి కేంద్రమే టెండర్లు పిలిచింది. ఈ వారంలో వాటిని తెరవనున్నారు.
గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో 1,450 విద్యుత్ బస్సులు ఆర్టీసీ తీసుకోనుంది. దీనికోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన సిద్ధమైంది. జులై నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే ఏడాది మార్చి నుంచి విద్యుత్ బస్సులు పరుగులు పెట్టేలా చూడనున్నారు.
పూర్వోదయ పథకం కింద కేంద్రం పలు రాష్ట్రాలకు విద్యుత్ బస్సులు కేటాయిస్తుండగా, అందులో ఏపీకి వెయ్యి బస్సులు ఇవ్వనుంది. గ్రామీణ ప్రాంతాలు, కొంత దూర ప్రాంతాలకు నడిపేందుకు వీలుగా మరో 2 వేల బస్సులను పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదన కేంద్రం వద్దకు వెళ్లింది.
సీఎనీ అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 500 సీఎన్బీ బస్సులు ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. సీఎన్బీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు.
-ఇప్పుడున్న బస్సుల రంగులే….
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ వంటి బస్సులకు ఇప్పుడున్న రంగులే.. విద్యుత్ బస్సుల్లో కూడా ఉంటాయని, దీనివల్ల ప్రయాణికులకు ఎటువంటి గందరగోళం ఉండదని అధికారులు చెబుతున్నారు.
