వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్ర విముక్తికి రెండేళ్లు
– విధ్వంసం…విధ్వేషం…వినాశనం… ఇదే జగన్ ఐదేళ్ల పాలనకు నిర్వచనం
– వైసీపీ ఫేక్ బుక్‌లెట్లతో నిజాలు మారవు
– గొడ్డలి పోటు… వెన్నుపోటు… పేటెంట్ జగన్‌దే
– కేవలం 24 నెలల్లో అభివృద్ధి, సంక్షేమానికి కొత్త దిశ చూపిన కూటమి ప్రభుత్వం
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, జూన్ 04 గరుడధాత్రి : వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి పొంది రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అరాచక, విధ్వంసక రాజకీయాలకు చరమగీతం పాడారని, ప్రజల స్పష్టమైన తీర్పును అంగీకరించలేకనే వైసీపీ నాయకులు నిరసనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
వైసీపీ నిరసనలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించే చర్యలేనని అచ్చెన్నాయుడు అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని, ప్రతిపక్షాల గొంతు నొక్కి, భయాందోళనల వాతావరణంలో పాలన సాగించారని మండిపడ్డారు.
మహానాడు ఘన విజయాన్ని చూసి అసూయ, అక్కసు, ద్వేషంతో రగిలిపోతున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫేక్ బుక్‌లెట్ విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని మంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టిన వ్యక్తి ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్ పాలన అంటే అభివృద్ధికి గొడ్డలి పోటు, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు, రాష్ట్ర భవిష్యత్తుకు వినాశనం అని మండిపడ్డారు. జగన్ చరిత్ర మొత్తం చూస్తే గొడ్డలి పోటు, వెన్నుపోటుకు నిలువెత్తు నిర్వచనమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులను కాపాడుతూ న్యాయాన్ని ఖూనీ చేసిన వ్యక్తి జగనేనన్నారు. తెలంగాణకు చెందిన శివకుమార్ స్థాపించిన పార్టీని కబ్జా చేసి తన సొంత పార్టీగా మార్చుకున్న వ్యక్తి జగనేనన్నారు. తల్లి, చెల్లికి సైతం న్యాయం చేయకుండా మహిళా ఆస్తి హక్కులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్‌దేనని విమర్శించారు. తన అవలక్షణాలను ప్రత్యర్థులపై రుద్దడం, చెప్పిన అబద్ధాన్ని వందసార్లు చెప్పడం జగన్ రాజకీయ శైలిగా మారిందన్నారు.
-ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం చీకట్లోకి
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో చట్టవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికార మదంతో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన పాలన చివరకు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసిందన్నారు. అనాలోచిత నిర్ణయాలు, విచ్చలవిడి అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని, మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి నవ్యాంధ్రకు ఆశాకిరణమైన అమరావతిని నిర్వీర్యం చేశారని అన్నారు. రోడ్లను కనీసం మరమ్మతులు చేయకుండా రవాణా రంగాన్ని దెబ్బతీశారని, పారిశ్రామికవేత్తలను బెదిరింపులతో పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల భూములకు అభద్రత సృష్టించారని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. రూ.1,600 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకుండా అన్నదాతలను మోసం చేశారని అన్నారు. బటన్ నొక్కుతున్నామని ప్రచారం చేసుకుంటూ సంక్షేమ పథకాలపై అనేక ఆంక్షలు విధించి లక్షలాది మందిని లబ్ధికి దూరం చేశారని, తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై రూ.1.29 లక్షల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి, మాఫియాలకు కేంద్రంగా మార్చి యువత భవిష్యత్తును నాశనం చేశారని, శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీశారని అన్నారు.
-నవరత్నాలు కాదు… నవ మోసాలు
జగన్ పాదయాత్ర హామీలు, వైసీపీ మేనిఫెస్టో హామీలలో 85 శాతం అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. తల్లికి వందనం పథకం కింద హామీ ప్రకారం ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తున్న కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పారు. అయితే ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తామని చెప్పి చివరకు ఒక్క బిడ్డకే పరిమితం చేసి వైసీపీ మోసం చేసిందన్నారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14 వేలు, కేంద్రంతో కలిపి రూ.20 వేలు అందిస్తున్నామని, కానీ రైతు భరోసా పేరుతో జగన్ ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాష్ట్ర నిధుల నుంచి కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా అమలు అవుతుంటే వైసీపీ పాలనలో ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచారని గుర్తు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు.
-యువతను మోసం చేసిన జగన్
నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతకు అన్యాయం చేసిన వ్యక్తి జగనేనని అచ్చెన్నాయుడు విమర్శించారు. మెగా డీఎస్సీ హామీ ఇచ్చి ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదన్నారు. ఏపీపీఎస్సీని అవినీతిమయం చేశారని, పరిశ్రమలను తరిమివేసి ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని ఆరోపించారు. రెండేళ్లలోనే లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తోందన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 24 లక్షల ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం చేశామని చెప్పారు.
-సామాజిక న్యాయానికి తూట్లు పొడిచిన వైసీపీ
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో రూ.1.14 లక్షల కోట్లను దారి మళ్లించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పసుపు కుంకుమ, పెళ్లి కానుక వంటి పథకాలను రద్దు చేసి మహిళలకు అన్యాయం చేశారని అన్నారు. పెన్షన్ల విషయంలోనూ ప్రజలను మోసం చేశారని, సీఎం చంద్రబాబు నాయుడు ఒకేసారి పెన్షన్ పెంచితే జగన్ విడతలవారీగా పెంచి ప్రతి పెన్షన్‌దారుడికి వేల రూపాయల నష్టం కలిగించారని చెప్పారు. అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపు కొట్టారని, మద్యనిషేధం హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.
-నేరాలు, అరాచకాలకు ఐదేళ్లు
వైసీపీ పాలనలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు, విద్యార్థులు, దళితులు, రైతులు, వైద్యులు ఎవరూ రక్షణలో లేరని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజావేదిక విధ్వంసం నుంచి మొదలుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు, దళిత యువకుల హత్యలు, వైద్యుల వేధింపులు, సోషల్ మీడియా పోస్టులకు కేసులు, అక్రమ అరెస్టులు, రాజకీయ కక్షసాధింపులు వరకూ రాష్ట్రాన్ని అరాచకానికి కేంద్రంగా మార్చారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడిని నిరాధార కేసులతో 53 రోజులు జైలులో పెట్టారని, కోడెల శివప్రసాద్ వంటి నాయకులను మానసికంగా వేధించి ప్రాణాలు తీసే పరిస్థితులు సృష్టించారని పేర్కొన్నారు.
-అధికారంలో లేకపోయినా విషప్రచారమే
అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ తన వైఖరి మార్చుకోలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతి నుంచి విశాఖ పెట్టుబడుల వరకు ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై బురదజల్లడం ఆయన రాజకీయంగా మారిందన్నారు. పోలవరం, ఉచిత బస్సు ప్రయాణం, అమరావతి నిర్మాణం, పెట్టుబడులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దేవాలయాలు, రైతులు, మహిళలు, దళితులను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
-జగన్ అబద్ధాలు నమ్మేంత అమాయకులు కాదు ఆంధ్రులు
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఫేక్ బుక్‌లెట్లు విడుదల చేస్తే నిజాలు మారవని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విధ్వంసం, విధ్వేషం, దోపిడీ, అబద్ధాలు, నేరాలు, కక్షసాధింపులకు ప్రతిరూపమే జగన్ పాలన అని అన్నారు. గొడ్డలి పార్టీ ఐదేళ్ల చీకటి పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడి, కేవలం 24 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
