-రైస్ మిల్లర్లతో సమావేశంలో టీటీడీ అదనపు ఈవో
-అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తుల ప్రశంసలు
గరుడధాత్రి :
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే టీటీడీ ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్, దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ముడి దినుసుల సరఫరాలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇటీవల భక్తుల నుంచి నిర్వహించిన అభిప్రాయ సేకరణలో దాదాపు 98 శాతానికి పైగా భక్తులు గతంతో పోల్చితే ప్రస్తుతం అందిస్తున్న అన్నప్రసాదం రుచి, నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని పేర్కొన్నారని అదనపు ఈవో తెలిపారు.
అలాగే సోమవారం రాత్రి రైస్ మిల్లర్లు స్వయంగా అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోగా, అధిక శాతం మంది భక్తులు అన్నప్రసాద నాణ్యత, రుచిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.
అభిప్రాయ సేకరణలో కొందరు భక్తులు అన్నప్రసాదంతో పాటు అదనంగా పప్పును కూడా వడ్డిస్తే మరింత బాగుంటుందని సూచించారని తెలిపారు. ఈ సూచనను సానుకూలంగా పరిగణించి, అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.
టీటీడీ నూతనంగా ప్రవేశపెడుతున్న ఎంపానల్ వ్యవస్థ ద్వారా ముడి పదార్థాల కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, నాణ్యత ప్రమాణాలను మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా భక్తులకు అందించే అన్నప్రసాదం నాణ్యతను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
టీటీడీకి అవసరమైన వివిధ రకాల పప్పు దినుసులను కూడా దాల్ అసోసియేషన్ ద్వారా సరఫరా చేసే అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అత్యుత్తమ నాణ్యత గల ఆహార పదార్థాలు అందించే దిశగా విధివిధానాలు రూపొందిస్తున్నామని అదనపు ఈవో చెప్పారు. ఈ అంశాన్ని టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి, త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సమావేశంలో వేర్ హౌజ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి, ప్రొక్యూర్ మెంట్ విభాగాధిపతి శ్రీ ఉమా శంకర్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన రైస్, దాల్ మిల్లర్లు పాల్గొన్నారు.
