-ప్రజారోగ్యంపై అధికారుల నిర్లక్ష్యమా?
వరదయ్యపాలెం, జూన్ 12 గరుడధాత్రి : తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం సచివాలయ పరిధిలో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం పూర్తై దాదాపు నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణం పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే క్లినిక్‌ను ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని స్థానికులు, సామాజిక కార్యకర్త ఓడూరు డిమాండ్ చేశారు.
బత్తలవల్లం పంచాయతీ పరిధిలో స్థానిక జనాభాతో పాటు సమీపంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు నివసిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఐదు పంచాయతీల ప్రజలు కూడా వైద్య అవసరాల కోసం ఈ ప్రాంతంపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ప్రజలు వైద్య సేవల కోసం సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో బత్తలవల్లం విలేజ్ హెల్త్ క్లినిక్‌ను తక్షణమే ప్రారంభించి వైద్య సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
“ప్రజారోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. నిర్మాణం పూర్తయిన ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి” అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
