సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేందుకే ఈ-కేవైసీ.. క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం!
దొరవారిసత్రం, జూలై 21 (గరుడదాత్రి న్యూస్)
మండల పరిధిలోని అనేపూడి మరియు చందనమూడి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పర్సనల్ డేటా ఈ-కేవైసీ నమోదు మరియు పరిశీలన ప్రక్రియను దొరవారిసత్రం తహసీల్దార్ రాజేంద్ర క్షేత్రస్థాయిలో నేరుగా సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి లబ్ధిదారుల రికార్డులను తహసీల్దార్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందాలనే దృఢ సంకల్పంతోనే ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ తమ ఆధార్ వివరాలతో ఈ-కేవైసీని సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ-కేవైసీ నమోదు వేళ ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ, నిర్దేశిత సమయంలోగా శాతాన్ని పూర్తి చేయాలని సచివాలయ, రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక రెవెన్యూ అధికారులు, విఆర్‌ఓలు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
