గాంధీ జయంతి, ఐసీడీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికుల నిరసన
పలమనేరు, అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) :
మహాత్మా గాంధీ 157వ జయంతి, ఐసీడీఎస్ 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలమనేరు ప్రాజెక్ట్ బాబూజీ మున్సిపల్ పార్కులో అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ , ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఆర్. జ్యోతి, సీఐటీయూ ప్రాజెక్ట్ కార్యదర్శి భారతి, ఏఐటీయూసీ కార్యదర్శి శాంతి, ఐఎఫ్‌టీయూ ప్రాజెక్ట్ కార్యదర్శి సుమ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. 1972 గ్రాడ్యుటీ చట్టం ప్రకారం సర్వీసులో ఉండి మరణించిన లేదా విధులకు దూరమైన వారికి గ్రాడ్యుటీ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రీ-స్కూల్ పిల్లల మెనూ చార్జీలను ఒక్కొక్కరికి కనీసం ఐదు రూపాయలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా, ఏఐకేఎంఎస్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ.. 2019 నుంచి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు వేతనాలు పెంచలేదన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రకరకాల యాప్‌ల పేరుతో పనిభారం విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పోరాటాల ఫలితంగా 2024 జూలైలో వేతనాలు పెంచుతామని మినట్ కాపీ ఇచ్చారని, ఆ తర్వాత 2026 మార్చి 2న ఆందోళన చేశామని గుర్తుచేశారు. మార్చి 10న ఐసీడీఎస్ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వగా.. మంత్రితో మాట్లాడి త్వరలోనే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ నేటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే కనీస వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు చేయాలని కోరారు. అదేవిధంగా, అంగన్‌వాడీ పిల్లలకు ‘తల్లి వందనం’ పథకాన్ని అమలు చేసినందుకు ప్రభుత్వానికి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు ప్రభావతి, రాధ, టి. మహేశ్వరి, ఉమ, శోభ, సుశీల, నాగవేణి, సుబ్బమ్మ, కవిత, ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.
