ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికపిలతీర్థంలో దివ్య చక్రస్నానం..

కపిలతీర్థంలో దివ్య చక్రస్నానం..

📰 Generate e-Paper Clip

భక్తి తరంగాల్లో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

స్నపన తిరుమంజనంతో ఆధ్యాత్మిక వైభవం

ధ్వజావరోహణంతో నేడు బ్రహ్మోత్సవాలకు మంగళం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించిన చక్రస్నాన మహోత్సవంతో పరమపవిత్రంగా ముగిశాయి. కపిలతీర్థం ఆళ్వార్‌ తీర్థం వద్ద జరిగిన ఈ దివ్య ఘట్టాన్ని వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించి పుణ్యఫలాన్ని పొందారు.
ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, చక్రత్తాళ్వార్‌ ఆలయం నుండి మంగళవాద్యాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి కపిలతీర్థంలోని ఆళ్వార్‌ తీర్థానికి విచ్చేశారు. మార్గమధ్యంలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్లరసాలతో జరిగిన అభిషేకం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.
తదనంతరం చక్రత్తాళ్వార్‌కు వైభవంగా చక్రస్నానం నిర్వహించగా, తీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు అపార భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం స్వామివారు టీటీడీ పరిపాలనా భవనం ఎదుటనున్న పి.ఆర్‌.తోటకు వేంచేశారు.
సాయంత్రం 5 గంటలకు పి.ఆర్‌.తోట నుండి స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
రాత్రి 8.40 గంటల నుండి 9.30 గంటల వరకు నిర్వహించే ధ్వజావరోహణ మహోత్సవంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!