* అమిగోస్ లైవ్ బ్యాండ్ కచేరీతో అలరించిన మ్యూజికల్ నైట్.
కుప్పం,సెప్టెంబర్ 13 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం ఇంజినీరింగ్ కళాశాల 25 సంవత్సరాల విద్యా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. 25 ఏళ్ల విద్యా ప్రయాణం, సాధించిన విజయాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపాయి.సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అమిగోస్ లైవ్ బ్యాండ్ కాన్సర్ట్, మ్యూజికల్ నైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లైవ్ మ్యూజిక్‌తో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థులు, కళాశాల సిబ్బంది సంగీత కార్యక్రమాన్ని ఉత్సాహంగా ఆస్వాదించారు.
వేడుకల్లో భాగంగా గతంలో నిర్వహించిన కలర్‌ఫుల్ క్రాకర్, షార్ట్ ఫిల్మ్స్, డ్యాన్స్, ఫ్లాష్ మాబ్, క్రికెట్ తదితర పోటీలు, కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల సృజనాత్మకత, ప్రతిభను ప్రోత్సహించేలా ఈ పోటీలు నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.అదేవిధంగా కళాశాలలో 25 సంవత్సరాలుగా సేవలందించిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. సుదీర్ఘకాలంగా సంస్థకు వారు అందించిన సేవలు, అంకితభావం, కృషిని గుర్తించి మేనేజ్‌మెంట్ వారిని అభినందించింది. సంస్థ 25 ఏళ్ల ప్రస్థానంలో ఉద్యోగుల సేవలు కీలకమైనవని పేర్కొన్నారు.
కుప్పం ఇంజినీరింగ్ కళాశాల గత 25 సంవత్సరాల్లో విద్యా, సాంకేతిక, సహపాఠ్య రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందని కళాశాల ప్రతినిధులు తెలిపారు. న్యాక్ ఏ గ్రేట్, ఎన్.బి.ఏ అక్రెడిటేషన్ ఐ ఎస్ ఓ 9001:2015 సర్టిఫికేషన్ వంటి గుర్తింపులతో విద్యా ప్రమాణాలను కొనసాగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.కళాశాల చైర్మన్ బి.సి. నాగరాజ్, వైస్ చైర్మన్ ఎన్. సునీల్ రాజ్, సెక్రటరీ ఎన్. సాగర్ రాజ్, ట్రెజరర్ ఎన్. శాంత, ప్రిన్సిపాల్ డా. ఎస్. సుధాకర్ బాబు ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారు.25 ఏళ్ల ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకున్న ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు గత విజయాలను స్మరించుకోవడంతో పాటు, భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో విద్యా రంగంలో ముందుకు సాగేందుకు కొత్త ఉత్సాహాన్ని అందించాయని కళాశాల యాజమాన్యం పేర్కొంది.
కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు
RELATED ARTICLES
