గంజాయి నిర్ములనకు ప్రత్యేక కిట్లతో నిఘా
-డీఎస్పీ చెంచుబాబు
గరుడధాత్రి :
తిరుపతి జిల్లావ్యాప్తంగా గంజాయి రవాణా, అమ్మకాలు మరియు వాడుకను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు.
సూళ్ళూరుపేట సర్కిల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడుతూ,,,
గతంలో గంజాయికి అలవాటు పడిన పాత కన్జ్యూమర్స్, అనుమానితులను గుర్తించి, వారికి తక్షణమే పరీక్షలు చేయడం కోసం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక కిట్లను అందుబాటులోకి తెచ్చారని డీఎస్పీ పేర్కొన్నారు.
ఈ కిట్లలో కొన్నింటిని నాయుడుపేట సబ్‌డివిజన్‌కు కేటాయించడం జరిగిందన్నారు.
పోలీస్ రికార్డుల్లో ఉన్న పాత కన్జ్యూమర్స్ ప్రస్తుతం కూడా గంజాయి తాగుతున్నారా? ఒకవేళ తాగుతుంటే ఎవరెవరితో కలిసి తాగుతున్నారు? వారికి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? అనే కోణంలో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి, ఆ గంజాయి నెట్‌వర్క్‌ను పూర్తిగా మట్టుబెట్టేందుకు ఈ కిట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.
నాయుడుపేట,సూళ్ళూరుపేట, వెంకటగిరి పట్టణాలతో పాటు వాటి శివారు ప్రాంతాలు, అలాగే తమిళనాడు సరిహద్దులో ఉన్న తడ తదితర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిని గుర్తించి ఈ కిట్ల ద్వారా అప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
నిబంధనలు మీరితే కఠిన చర్యలు :
ఏ రూపంలోనైనా గంజాయి తాగడం, రవాణా చేయడం లేదా అమ్మడం పూర్తిగా నిషేధమని, ఈ నిబంధనలను మీరితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ చెంచుబాబు హెచ్చరించారు. గంజాయికి సంబంధించి ప్రజల వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.
మద్యం మత్తులో గొడవలు పడుతూ, గంజాయి తాగారనే ప్రచారంతో సోషల్ మీడియాలో వచ్చే వార్తలను కూడా నిజానిజాలు తేల్చడానికి ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
రాత్రి వేళల్లో మరియు పట్టణ, మండల శివారుల్లోని హాట్‌స్పాట్స్‌పై పోలీసులు గట్టి నిఘా ఉంచారని.. ఇందుకోసం డ్రోన్ కెమెరాలను, ఈగిల్ సంస్థ ద్వారా వచ్చే సమాచారాన్ని మరియు ఈ ప్రత్యేక కిట్లను వాడుతూ గంజాయిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని డీఎస్పీ చెంచుబాబు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ ఎస్సై అజయ్ కుమార్ పాల్గొన్నారు.
