త్వరలో మూతపడనున్న సత్యవేడు సబ్ జైలు
గరుడధాత్రి :
తిరుపతి జిల్లా సత్యవేడు సబ్ జైలును త్వరలోనే మూసివేయనున్నారు.ప్రస్తుతం స్థానిక రెవెన్యూ కార్యాలయానికి పక్కనే కొనసాగుతున్న సబ్ జైల్ భవనాలు మరమ్మతుకు గురయ్యాయి. ప్రధానంగా రిమాండ్ ఖైదీలను ఉంచుతున్న జైలు గదులు బ్రిటిష్ హయాంలో నిర్మించారు.
ఈ నేపథ్యంలో రిమాండ్ ఖైదీలు ఉంటున్న గదులకు సంబంధించి గోడలు,స్లాబ్ బీటలు వారాయి.ఈ క్రమంలో వర్షం పడితే జైలు గదులన్నీ వర్షంతో నిండిపోవడంతో రిమాండ్ ఖైదీలకు అసౌకర్యంగా మారింది.సబ్ జైలు చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూడా బలహీనపడింది.
దీన్ని ఆశరా చేసుకొని గతంలో రిమాండ్ ఖైదీలు కూడా కొందరు తప్పించుకుని పరారు కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని మళ్లీ అదుపులోకి తీసుకొని సబ్ జైలుకు తరలించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.దీన్ని దృష్టిలో ఉంచుకొని మరమ్మతుకు గురైన సబ్జైలు గదులను బాగు చేయించడానికి జైలు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా ఇటీవల ఇంజనీరింగ్ అధికారులు సత్యవేడు సబ్ జైలును సందర్శించి రిమాండ్ ఖైదీలు ఉన్న జైలు భవనాలను పరిశీలించారు.అయితే సబ్ జైలు గోడలు స్లాబ్ బలహీనపడడంతో మరమ్మత్తు చేసిన ప్రయోజనం లేదని ఇంజనీరింగ్ విభాగం అధికారులు నివేదిక సమర్పించినట్లు సమాచారం.
దీంతో కొత్త భవనాన్ని నిర్మించడానికి నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలతో ప్రతిపాదనను సిద్ధం చేసి జైలు ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆమోదానికి పంపారు. అయితే నిధులు విడుదల కావాల్సి ఉంది.ఇదిలా ఉండగా సబ్ జైలు గోడలు,స్లాబ్ ఎప్పుడు కూలుతుందో నన్న ఆందోళన సబ్ జైల్ అధికారులలో నెలకొంటుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని సత్యవేడులో కొత్త సబ్ జైలు భవనాలను నిర్మించే వరకు తాత్కాలికంగా ప్రస్తుత సబ్ జైల్లో మూసివేయాలని ఈనెల 11వ తేదీన జైలు డీజీ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది.సబ్ జైలు మూసివేతపై ఇప్పటికే సత్యవేడు జ్యుడీషియల్ కోర్టుకు సమాచారం అందించామని సబ్ జైలు ఇన్చార్జి సూపర్డెంట్ వాసు పేర్కొన్నారు.
న్యాయస్థానం నుంచి అనుమతి రాగానే సబ్ జైల్ మూసివేసే అవకాశాలు ఉన్నాయి.అయితే పుత్తూరు,నగరి వంటి ప్రాంతాల్లో సబ్ జైలు లేకపోవడం వల్ల అక్కడ రిమాండ్ ఖైదీలను కూడా సత్యవేడు సబ్ జైలుకు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో ఇక్కడ కూడా సబ్ జైలు మూతపడనున్న నేపథ్యంలో సత్యవేడు,నగిరి,పుత్తూరు పరిధిలోనే రిమాండ్ ఖైదీలను చిత్తూరుకు,తిరుపతికి తరలించే పరిస్థితి లేకపోలేదు.పైగా రిమాండ్ ఖైదీలను దాదాపు 100 కిలోమీటర్ల దూరం వరకు పోలీసులు తరలించే పరిస్థితి రావడం భద్రతాపరంగా కూడా ఒక సవాలుగా మారే అవకాశాలు లేకపోలేదు.
❄సబ్ జైలు తాత్కాలికంగా మూసి వేసే అంశంపై జిల్లా జైలు ప్రధాన అధికారి రవిబాబును వివరణ కోరగా దెబ్బతిన్న సబ్ జైలు భవనాలను మరమత్తు చేయడానికి వీలు లేకుండా పోవడంతో తాత్కాలికంగా మూసివేస్తున్నామన్నారు.కొత్త భవనాలను నిర్మించడానికి అవసరమైన నిధులు కోసం ప్రభుత్వ ఆమోదానికి పంపామన్నారు.ఏది ఏమైనా దీనిపై పాలకులు స్పందించి సత్యవేడు సబ్ జైలు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది
