తగ్గని భానుడి భగభగలు…అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
-వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మృతి
గరుడధాత్రి :
విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం): భానుడి భగభగలకు రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మంగళవారం గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ‘పల్నాడు జిల్లా గురజాలలో 47.6, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల పరిధిలోని 125 మండలాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాలులు, 93 మండలాల్లో వడగాలులు, గురువారం 81 మండలాల్లో తీవ్ర, 203 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో బుధవారం చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా వానలు కురిసే అవకాశం ఉంది’ అని పేర్కొంది. మరోవైపు వడదెబ్బ ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కొల్లి ఉదయలక్ష్మి(68), తాతకుంట్లకు చెందిన బాణాల రాములు (80), కృష్ణా జిల్లాలోని మల్లవల్లిలో శతాధిక వృద్ధురాలు ఈశ్వరమ్మ, వక్కలగడ్డకు చెందిన అడ్డాడ రవాంబ(90), చింతలమడకు చెందిన చిగురుపాటి నల్లమ్మ(67), గుంటూరు జిల్లాలో వరగానికి చెందిన కట్టా దయమ్మ(60), గల్లా వీరయ్య (85), పల్నాడు జిల్లాలో సత్తెనపల్లికి చెందిన చిల్లపల్లి రామారావు(55), అనకాపల్లి జిల్లాలో చెరువుగట్టుకు చెందిన ఆడారి అప్పలనర్సమ్మ(76), గుల్లిపల్లికి చెందిన డొప్ప శ్రీరామ్మూర్తి (46), విశాఖలోని మధురవాడలో జీవీఎంసీ క్లాప్ వాహనం డ్రైవర్ పరవాడ అప్పలరాజు(35), ఏలూరు జిల్లాలో చింతలపూడికి చెందిన తోట సీతామహాలక్ష్మి(37), అనంతసాగరానికి చెందిన ఈశం వెంకటేశ్వరరావు(75), పెదగొన్నూరుకు చెందిన గుబిలి శేషగిరిరావు(77), తేరగూడేనికి చెందిన పరిశే సుబ్బారావు(78), చెట్టున్నపాడుకు చెందిన వనమాల రామాంజనేయులు(37), ఏలూరుకు చెందిన ఆళ్ల మంగాయమ్మ(80), సుంకర లీలావతి(79), చక్రాయగూడేనికి చెందిన ఎర్ర వెంకటేశ్వరరావు(65), పశ్చిమగోదావరి జిల్లాలో సత్యవరానికి చెందిన ఖండవల్లి సువర్ణరాజు(72), కొయ్యేటిపాడుకి చెందిన మహాలక్ష్మి(68), పొలమూరుకి చెందిన కొరవాటి పరదయ్య(70), సాపాటి నాగమణి(60) మృతి చెందారు. వీరితో పాటు విజయవాడలో ఒకరు, కృష్ణా జిల్లాలో నలుగురు కలిపి మొత్తం ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు మరణించారు. అలాగే కృష్ణా జిల్లాలో ఓ యాచకురాలు కూడా చనిపోయారు.
