దాసుకుప్పం జడ్పీ హైస్కూల్లో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
-పదో తరగతి ఫలితాల్లో కేవలం 34 శాతం ఉత్తీర్ణత
గరుడధాత్రి న్యూస్ :
సత్యవేడు మండలం దాసుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా ప్రమాణాలు సంవత్సరానికోసారి పడిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం, బోధనా సిబ్బంది నియామకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నప్పటికీ, కొన్ని పాఠశాలల్లో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు దాసుకుప్పం జడ్పీ హైస్కూల్ పరిస్థితిని స్పష్టంగా ప్రతిబింబించాయి. ఈ పాఠశాలలో 32 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, కేవలం 11 మంది మాత్రమే ఉత్తీర్ణులై 34 శాతం ఫలితాన్ని నమోదు చేశారు. మండలంలోని ప్రభుత్వ, జడ్పీ హైస్కూల్స్‌తో పోలిస్తే ఇది అత్యల్ప ఉత్తీర్ణత శాతంగా నిలిచింది.
మండలంలో పుదుకుప్పం తమిళం జడ్పీ ఉన్నత పాఠశాల 91 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, మదనపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల 86 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల 85 శాతం ఫలితాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. అయితే దాసుకుప్పం పాఠశాల మాత్రం వరుసగా మూడేళ్లుగా నిరాశాజనక ఫలితాలను నమోదు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
పాఠశాలలో బోధనా సిబ్బంది సరైన శ్రద్ధ చూపకపోవడం, విద్యార్థులపై పర్యవేక్షణ లోపించడం, క్రమశిక్షణ సమస్యలు వంటి కారణాల వల్లే విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఉపాధ్యాయులకు భారీ వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ, అందుకు తగ్గ ఫలితాలు కనిపించడం లేదని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
దాసుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయనే అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించి, అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
