పెట్రోల్ డీజిల్ పై ప్రజలు ఎవరు ఆందోళన చెందకండి…
ప్రతి పెట్రోల్ బంకు వద్ద రెవిన్యూ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ..
వైసిపి నేత అభినయ్ అసత్యపు ఆరోపణలు చేయడం తగదు..
విలేకరుల సమావేశంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం…
తిరుపతి, ఏప్రిల్ 27 :
తిరుపతి తిరుమల లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలలో పెట్రోల్ డీజిల్ పై వస్తున్న అపోహలను ప్రజలు ఎవరు నమ్మకండి, పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు. సోమవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుపతి నగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుపతి, తిరుమల ఆధ్యాత్మిక ప్రదేశాలకు దేశ విదేశాల నుండి కోట్లాది మంది భక్తులు తిరుపతి, తిరుమలలకు విచ్చేసే పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ ఇంధన సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్వయంగా పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షిస్తూ, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఈ సమయంలో వైఎస్సార్సీపీ నాయకుడు భూమన అభినయ్ అవగాహన లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఇంధన నిల్వలు లేవని అసత్య ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుండగా, ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అలాంటి ఫేక్ న్యూస్ కారణంగానే కొంతమంది ఒకేసారి పెట్రోల్ బంకులకు రావడంతో క్యూలైన్లు ఏర్పడుతున్నాయని, తెలియని విషయాలపై మాట్లాడక ముందు బాధ్యతగా వ్యవహరించాలని డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం హితవు పలికారు.
అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ తో సహా అధికారయంత్రాంగం కూడా తిరుపతిలో పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కృషి చేస్తున్నారని చెప్పారు.
ప్రజలు, వాహనదారులు, భక్తులు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవాలనే ఆందోళనతో ఒకేసారి బంకుల వద్దకు వెళ్లడం వల్ల తాత్కాలిక ఒత్తిడి ఏర్పడుతోందని, కావున ఎవరూ భయాందోళనలకు గురికాకుండా అవసరమైనంత మాత్రమే వినియోగించాలని సూచించారు.
ఇంటి వద్ద లేదా వాహనాల్లో అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ ఉంచడం భద్రతాపరంగా కూడా మంచిది కాదని, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అత్యవసర ప్రయాణాలు, ఉద్యోగ అవసరాలు, సేవా కార్యక్రమాలకు మాత్రమే ఇంధనాన్ని వినియోగిస్తే అందరికీ సమానంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
సోషల్ మీడియా వేదికలలో వస్తున్న అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించారు. తాత్కాలిక పరిస్థితిని ప్రజలు సహనంతో ఎదుర్కొంటే త్వరలోనే పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ నిరంతరం ప్రతి పెట్రోల్ బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని పెట్టి పరిస్థితులను ఎప్పటికి అప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా పనిచేస్తోందని, త్వరలో పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు. తిరుపతి ప్రజలు, భక్తులు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి అపోహలను నమ్మవద్దని కోడూరు బాలసుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, పుష్పావతి యాదవ్, బీజే కృష్ణా యాదవ్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు,విశ్వనాధం , ప్రమోద్ కుమార్, సతీష్ పాల్గొన్నారు.
