పిచ్చాటూరు, జూన్ 2 గరుడధాత్రి :
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పిచ్చాటూరు పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు పొగాకు, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ర్యాలీలో పాల్గొన్న వారు “మత్తు పదార్థాలు వద్దు – ఆరోగ్యం ముద్దు”, “మందు, సిగరెట్ వద్దు – పౌష్టికాహారం ముద్దు”, “చుట్ట, బీడీ, సిగరెట్ ప్రాణానికి పెనుముప్పు”, “పొగ త్రాగవద్దు – క్యాన్సర్ వ్యాధికి గురికావొద్దు” అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ముని చారిత్ర, డాక్టర్ ధనుష్, సామాజిక ఆరోగ్య అధికారి శివయ్య, ఆరోగ్య పర్యవేక్షకులు రాజారావు, వెంకటలక్ష్మమ్మతో పాటు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని వైద్యాధికారులు సూచించారు.
