మూడు దశాబ్దాల పార్టీ సేవకు గుర్తింపు ఎక్కడ?
గరుడధాత్రి న్యూస్ :
స్వర్గీయ రామారావు గారి ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చిన తనకు, మూడు దశాబ్దాలకుపైగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు దక్కలేదని టిడిపి సీనియర్ నాయకుడు ఎస్. నాగరాజు, అడ్వకేట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మహానాడు వేళ తన మనసులోని బాధను లేఖ రూపంలో వెల్లడించారు.
మధ్యతరగతి పేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగరాజు, కేవలం 27 ఏళ్ల వయసులో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై 1996–2001 మధ్య ఉత్తమ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా, “జన్మభూమి” ఉత్తమ అవార్డులను అందుకోవడం తన ప్రజాసేవా ప్రయాణంలో గర్వకారణమని పేర్కొన్నారు.
గ్రామ సర్పంచుల హక్కుల కోసం రాష్ట్రస్థాయి సర్పంచ్ సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు, విద్య, ఆరోగ్యం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, రైతుల సాగునీటి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశానని తెలిపారు. రిలే నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వాన్ని స్పందింపజేసిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు.
టిడిపి లో మండల ప్రధాన కార్యదర్శిగా రెండు పర్యాయాలు, సింగిల్ విండో వైస్ చైర్మన్‌గా, ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా, అనంతరం తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నిర్వహించానని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా, జర్నలిస్టుగా పనిచేస్తూనే పార్టీ పట్ల తన నిబద్ధతను కొనసాగించానని చెప్పారు. అక్రిడిటేషన్ నిరాకరణ వంటి ఇబ్బందులు ఎదురైనా విశ్వాసం మాత్రం తగ్గలేదన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నుంచి శాసనసభ ఎన్నికల వరకు పార్టీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని, ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంశలు పొందడం తనకు ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు.
అయితే, ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల్లో తనలాంటి నిస్వార్థ కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. “పదవుల కోసం కాదు… సేవకు విలువ దక్కాలనే ఆకాంక్షతోనే ఈ ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను” అని నాగరాజు పేర్కొన్నారు.
పార్టీకి జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్తల మనోభావాలను గుర్తించి, వారి సేవలను గౌరవించే దిశగా పార్టీ అధిష్టానం పునరాలోచించాలని ఆయన వినయపూర్వకంగా కోరారు.
