* కుప్పం ఏ ఎస్ పి బి.హేమంత్.
* కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్01,(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం విభాగం మరియు లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో గురువారం మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కుప్పం అదనపు పోలీసు సూపర్డెంట్ బి. హేమంత్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో యువత తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. శంకర్ మాట్లాడుతూ, విద్యార్థులు మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అవసరమని తెలిపారు.
కార్యక్రమంలో జాతీయ సేవా పథకం కార్యక్రమ అధికారి డా. వి. నారాయణ మూర్తి సమన్వయంతో జాతీయ సేవా పథకం వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు.కళాశాల అధ్యాపకులు డా. కె. మాధవి, కె. నమ్రత, సుబ్రహ్మణ్యం, చాంద్ బాషా, శ్రీహరి సోమేశ్వరరావు, మణికంఠ, కేశవ్ కుమార్, డా. సుదర్శనం, పద్మావతి దేవి, ఎన్. శ్రీనివాసులు తదితర అధ్యాపకులు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల వినియోగానికి పూర్తిగా దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని విద్యార్థులకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
