-ఆక్వా, పొగాకు, తోతాపూరి మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయాలు
– తోతాపూరి మామిడికి కేజీకి రూ.4 ప్రోత్సాహకం, ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గింపు, పొగాకు కనీస ధర రూ.200 తగ్గకూడదు
– రాష్ట్ర ఆర్థిక సవాళ్లు ఉన్నా రైతు సంక్షేమంలో రాజీ లేదు: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, జూన్ 18: రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన, ఆక్వా ఫీడ్ ధరలు, వర్జీనియా పొగాకు కొనుగోళ్లు, తోతాపూరి మామిడి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విస్తృత సమీక్ష నిర్వహించి రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపినా, రైతులపై భారం పడకూడదన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారని చెప్పారు. ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచడానికి ప్రభుత్వం అనుమతించలేదని, రైతులు, కంపెనీల మధ్య సమన్వయం ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రావాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర అంగీకారంతో పరిమిత స్థాయిలో ధరల సవరణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఫీడ్ ధర కేజీకి ఇప్పుడున్న ఎంఆర్‌పీ రూ.112 నుంచి రూ.108కి తగ్గనుంది. ఆక్వా ఫీడ్ ధర స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులు, అధికారులతో ఒక కమిటీ వేయాలని, 20 రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలని, అనంతరం ధరపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు మంత్రి తెలిపారు.
-వర్జీనియా పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం
అంతర్జాతీయ మార్కెట్లలో వర్జినీయా పొగాకు ఉత్పత్తి పెరగడం, ఎగుమతి పరిస్థితులు మారడం వల్ల ధరలు ప్రభావితమైనప్పటికీ రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. పొగాకు వేలం కేంద్రాల్లో అన్ని కొనుగోలు సంస్థలు తప్పనిసరిగా పాల్గొనాలని, పొగాకు బోర్డు పరిధిలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లు పూర్తిస్థాయిలో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. రైతులు తీసుకొచ్చిన పొగాకును తిరస్కరించే పరిస్థితి ఉండకూడదని, మార్కెట్‌లో పొగాకు రకం ఏదైనా కిలో రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని సీఎం ఆదేశించారని, పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. వేలం కేంద్రాల వెలుపల జరిగే అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా భవిష్యత్తులో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సాగు విస్తీర్ణంపై రైతులకు ముందస్తు మార్గదర్శకాలు అందించే చర్యలు చేపడతామని తెలిపారు.
-తోతాపూరి మామిడి రైతులకు కేజీకి రూ.4 ప్రోత్సాహకం
తోతాపూరి మామిడి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ రైతులకు నష్టం జరగకూడదన్న సంకల్పంతో గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తోతాపూరి మామిడికి కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు వెల్లడించారు. పల్ప్ పరిశ్రమల్లో నమోదు చేసుకుని మామిడిని విక్రయించిన రైతుల ఖాతాల్లో నేరుగా ప్రోత్సాహక మొత్తాన్ని జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం వేలాది మంది మామిడి రైతులకు గణనీయమైన ఊరటనిస్తుందని చెప్పారు. జూన్ 20న పల్నాడు జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమంలో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5,000 చొప్పున రైతులకు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో రైతు సంక్షేమానికి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం అరుదైన విషయమని అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కార మార్గాలు అన్వేషిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల ఆదాయం పెరగడం, గిట్టుబాటు ధరలు లభించడం, ఉత్పత్తి వ్యయాలు తగ్గించడం, అవసరమైన చోట ప్రభుత్వ జోక్యంతో రైతులకు రక్షణ కల్పించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యాక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేమ స్వామి, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసిహారెడ్డి, దామరచెర్ల జనార్థన్ పాల్గొన్నారు.
