ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సత్యవేడు టీడీపీ పరిస్థితిపై అధిష్టానం ద్వంద్వ వైఖరి.‌.?

సత్యవేడు టీడీపీ పరిస్థితిపై అధిష్టానం ద్వంద్వ వైఖరి.‌.?

📰 Generate e-Paper Clip

-వర్గ విభేదాలు.. సమన్వయ లోపం.. !

-స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో
అయోమయం..?

సత్యవేడు సెప్టెంబర్ 13 గరుడధాత్రి :

తమిళనాడు సరిహద్దులో ఉన్న సత్యవేడు రిజర్వు నియోజకవర్గం ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచిందని ఆ పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపం, అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సత్యవేడు టికెట్‌ను ఆశించిన పలువురు స్థానిక నాయకులను పక్కనపెట్టి, చివరి దశలో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన కోనేటి ఆదిమూలంకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అనంతరం ఆయన సత్యవేడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అయితే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం అప్పట్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. సస్పెన్షన్‌కు చాలాకాలం గడిచినా పార్టీ పరంగా తదుపరి నిర్ణయం ఏమిటన్న దానిపై స్పష్టత లేకపోవడం పార్టీ శ్రేణుల్లో అయోమయానికి కారణమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

-కోఆర్డినేటర్ ఉన్నా… సమన్వయం ఎక్కడ..?

సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్‌గా కూరపాటి శంకర్‌రెడ్డిని అధిష్టానం నియమించినప్పటికీ, పార్టీలోని వివిధ వర్గాలను సమన్వయం చేయడంలో ఇంకా పూర్తి స్థాయి ఫలితం కనిపించడం లేదని కొందరు సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో వర్గాల మధ్య దూరం కొనసాగుతోందని, దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఎటువైపు ఉండాలనే విషయంలో సందిగ్ధంలో ఉన్నారని వారు చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన అనుచరులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వర్గం పేర్కొంటోంది.
ఇదిలా ఉండగా సత్యవేడు నియోజకవర్గ బీఎల్ఏ ఇన్‌చార్జిగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు కోనేటి సుమన్ నియమితులయ్యారనే అంశం కూడా స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఒకవైపు పార్టీ అధిష్టానం నియోజకవర్గ వ్యవహారాల కోసం కోఆర్డినేటర్‌ను నియమించడం, మరోవైపు ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించడం వంటి పరిణామాలపై పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల హీరో పరిశ్రమ రెండో యూనిట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరైన సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యేకు సంబంధించిన అధికారిక అంశాలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా కలెక్టర్‌కు ముఖ్యమంత్రి మౌఖికంగా సూచనలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.

-స్థానిక సంస్థల ఎన్నికల వేళ అసలు పరీక్ష..!

సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ, కూటమి నేతల మధ్య పూర్తి స్థాయి సమన్వయం లేకపోవడం, వర్గాల కార్యక్రమాలకు కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు దూరంగా ఉండటం పార్టీ భవిష్యత్‌కు సవాలుగా మారుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇదే పరిస్థితి కొనసాగితే క్షేత్రస్థాయిలో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఇకనైనా టీడీపీ అధిష్టానం సత్యవేడు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి, నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించి అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
వర్గ విభేదాలకు అధిష్టానం ముగింపు పలుకుతుందా..? నాయకుల మధ్య సమన్వయం తీసుకొస్తుందా..? లేక స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందా..? అన్నది ఇప్పుడు సత్యవేడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!