ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసామాజిక న్యాయం – సమగ్ర సాధికారత దిశగా చారిత్రాత్మక అడుగులు

సామాజిక న్యాయం – సమగ్ర సాధికారత దిశగా చారిత్రాత్మక అడుగులు

📰 Generate e-Paper Clip

-విద్య, ఉపాధి, సంక్షేమం, దివ్యాంగుల అభివృద్ధి, గ్రామ-వార్డు పరిపాలనలో విశిష్ట పురోగతి
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మాత్యులు డా. డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి

అమరావతి, జూన్ 10: సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అట్టడుగు వర్గాల సమగ్ర సాధికారత అనే మహత్తర లక్ష్యాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పరిపాలనకు కొత్త దిశను నిర్దేశిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు & వృద్ధుల సంక్షేమం, స్వర్ణ గ్రామం & వార్డు శాఖా మాత్యులు డా. డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను శాశ్వతంగా తొలగించాలంటే విద్య, నైపుణ్యం, ఉపాధి, ఆరోగ్యం, గౌరవప్రద జీవనం అనే అంశాలను సమగ్రంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. ఆ దిశగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, హాస్టళ్లు, స్టడీ సర్కిల్స్‌, స్కాలర్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, దివ్యాంగుల సంక్షేమ పథకాలు, స్వర్ణగ్రామం & వార్డు వ్యవస్థల ద్వారా అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు.

-విద్యా సాధికారతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం…
ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తూ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కింద రూ.1,543.17 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసి 5.40 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చామని మంత్రి వెల్లడించారు. అలాగే ప్రీ మెట్రిక్‌ విద్యార్థులకు “తల్లి కి వందనం” కార్యక్రమం ద్వారా రూ.326.74 కోట్లను 2.51 లక్షల మందికి అందజేయడం జరిగిందని తెలిపారు.

విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా, కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ వ్యవస్థలోనే అందజేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని చెప్పారు. నీట్‌, జేఈఈ, సివిల్స్‌, గ్రూప్స్‌, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్‌ను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.

డీఎస్సీ కోచింగ్ ద్వారా 2,000 మందికి శిక్షణ ఇవ్వగా, అందులో 331 మంది ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లుగా అనేక మంది ఉద్యోగాలు సాధించడం ద్వారా ప్రభుత్వ కోచింగ్ వ్యవస్థ సమర్థతను నిరూపించిందన్నారు.

-గురుకులాలు – హాస్టళ్లలో రికార్డు స్థాయి ఫలితాలు…
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని మంత్రి తెలిపారు. టెన్త్ లో 85.32 శాతం, ఇంటర్మీడియట్‌లో 72.30 శాతం ఫలితాలు నమోదయ్యాయని చెప్పారు. ప్రత్యేకంగా గురుకులాల్లో టెన్త్‌లో 89 శాతం, ఇంటర్మీడియట్‌లో 92 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు.

ఇంటర్మీడియట్‌లో 950కు పైగా మార్కులు 45 మంది విద్యార్థులు సాధించగా, టెన్త్లో 591 మార్కులు సాధించిన విద్యార్థి హాస్టల్‌ నుంచే రావడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు, ప్రత్యేక సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నీట్‌, జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లోనూ విద్యార్థులు రాణించేలా నాలుగు ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

-హాస్టళ్లలో సమగ్ర మౌలిక వసతుల కల్పన…
విద్యార్థులకు సురక్షిత, పరిశుభ్రమైన, గౌరవప్రద వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రూ.104.96 కోట్ల వ్యయంతో హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టి 774 హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరిచామని చెప్పారు.

ప్రతి హాస్టల్‌లో RO ప్లాంట్లు, కొత్త మెట్రన్స్, పరిశుభ్రత నిర్వహణకు ప్రత్యేక శానిటేషన్ వ్యవస్థలు, అవుట్‌సోర్సింగ్ హౌస్‌కీపింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 989 హాస్టళ్లలో రూ.19.80 కోట్లతో AI ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అలాగే మెకనైజ్డ్ కిచెన్లను ప్రవేశపెట్టి పరిశుభ్రమైన, పోషకాహార భోజనం అందిస్తున్నామని చెప్పారు. వంట సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

-విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రత్యేక కార్యాచరణ…
ప్రతి హాస్టల్‌, గురుకులంలో హెల్త్ సూపర్‌వైజర్లు, నర్సింగ్ సిబ్బందిని నియమించి విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. హాస్టళ్లలో విద్యార్థులు కుటుంబ సభ్యుల్లా ఉండేలా వార్డెన్లు, సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు.

-దివ్యాంగుల సంక్షేమంలో వినూత్న సంస్కరణలు…
దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 30 లక్షల మందికి సేవలు అందించామని, రూ.13 కోట్లకు పైగా నిధులు కేటాయించామని తెలిపారు. 52,263 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశామని చెప్పారు. 329 దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని, త్వరలో నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు.

దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,000లకు పెంచిన ప్రభుత్వం, వారికి విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ముందంజలో ఉందన్నారు. ప్రతి కలెక్టరేట్‌లో దివ్యాంగులకు అనుకూల సౌకర్యాలు, ప్రత్యేక లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ట్రాన్సుజెండర్‌ల సంక్షేమం కోసం ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి వారికి గౌరవప్రద జీవనోపాధి కల్పించే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

-స్వర్ణ గ్రామం & వార్డు వ్యవస్థ – ప్రజలకు చేరువైన పరిపాలన…
స్వర్ణ గ్రామం & వార్డు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 1.68 కోట్ల ఇళ్ల మ్యాపింగ్‌, 1.71 కోట్ల కుటుంబాల ఈ-కేవైసీ పూర్తి చేశామని వెల్లడించారు. డిజిలాకర్‌ ద్వారా ప్రతి పౌరుడు తన ముఖ్య పత్రాలను డిజిటల్‌గా భద్రపరుచుకునే అవకాశం కల్పించామని తెలిపారు. గ్రామ, వార్డు సిబ్బందికి ప్రమోషన్లు, బదిలీల్లో పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

-ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంలో రికార్డు…
2024-25 సంవత్సరానికి ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.26,044 కోట్ల కేటాయింపు చేశామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది 10 శాతం అధికమని పేర్కొన్నారు. కేవలం నిధుల కేటాయింపే కాకుండా వాటి వినియోగంలోనూ రికార్డు స్థాయి పురోగతి సాధించామని తెలిపారు.

-మహిళలు, వృద్ధులు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండ…
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎస్సీ మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం ఉపాధి పథకాలు, సబ్సిడీ రుణాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
-సంక్షేమం మాత్రమే కాదు – సాధికారతే ప్రభుత్వ లక్ష్యం…
తమ ప్రభుత్వం సంక్షేమాన్ని కేవలం పథకాల పంపిణీకి మాత్రమే పరిమితం చేయడం లేదన్నారు. విద్య, నైపుణ్యం, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, గౌరవప్రద జీవనం కల్పించడం ద్వారానే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. ప్రతి బలహీన వర్గ కుటుంబం జీవితంలో స్థిరమైన మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ, వృద్ధ, ట్రాన్సుజెండర్ కుటుంబం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందేలా నిరంతరం కృషి కొనసాగుతుందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిఫల్ సెక్రటరే ఎమ్.ఎమ్.నాయక్, రాష్ట్ర స్త్రీ శిశు, దివ్యాంగ, వృద్ధ, ట్రాన్సుజెండర్ సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు బి.లావణ్య వేణి, ఏ.పి. గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు శాఖ సంచాలకులు శివ ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు కె.సునీల్ రాజ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!