25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
పిచ్చాటూరు, సెప్టెంబర్ 23 గరుడధాత్రి:
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న మండలంలోని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేయించే కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ముని చారిత్ర కోరారు.
ఈ మేరకు బుధవారం పిచ్చాటూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్న భోజనం అనంతరం పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలను అందించనున్నట్లు తెలిపారు. మండల పరిధిలో మొత్తం 5,417 మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ తప్పనిసరిగా మాత్రలు వేయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఆ రోజు పాఠశాలకు హాజరుకాని పిల్లలకు అక్టోబర్ 5న మాప్‌అప్ డే సందర్భంగా నులిపురుగుల నివారణ మాత్రలను అందజేస్తామని తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి 100 శాతం పూర్తి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో మండల తహసీల్దార్ చంద్రబాబు నాయుడు, మండల విద్యాశాఖ అధికారి యుగంధర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు సుమతి, కల్పలత, ఆరోగ్య పర్యవేక్షకులు రాజారావు, వెంకటలక్ష్మమ్మ, ఆరోగ్య కార్యకర్త మునిరాజా తదితరులు పాల్గొన్నారు.
