ePaper
Monday, October 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాలుగు నియోజకవర్గాలకు విస్తరించిన తుడా అభివృద్ధి ప్రణాళిక

నాలుగు నియోజకవర్గాలకు విస్తరించిన తుడా అభివృద్ధి ప్రణాళిక

📰 Generate e-Paper Clip

– రూ.200 కోట్లతో 19 కిలోమీటర్ల మేర 8 మాస్టర్ ప్లాన్ రోడ్లు
– తిరుపతి అభివృద్ధికి ఫేజ్‌-1 పనులు.. డిసెంబర్‌ నాటికి ఫేజ్‌-2 ప్రాజెక్టులు ప్రారంభం

తిరుపతి అక్టోబర్ 10 గరుడధాత్రి :

ఆధ్యాత్మిక నగరం తిరుపతిని ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోందని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెల్లడించారు. గతంలో ఒక ప్రాంతానికే పరిమితమైన అభివృద్ధి పనులను ప్రస్తుతం చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాలకు విస్తరిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో తిరుపతి జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

– ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మాస్టర్ ప్లాన్ రోడ్లు

తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతికి వచ్చే లక్ష నుంచి లక్షన్నర మంది యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. నగర పరిసరాల్లో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో 19 కిలోమీటర్ల మేర ఎనిమిది ప్రధాన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

శెట్టిపల్లి పరిధిలో 80, 100 అడుగుల వెడల్పుతో రహదారులు నిర్మిస్తున్నామని, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లేఅవుట్‌ను మరో మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని దామినేడు ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లు, ప్లాట్లకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేతో చర్చించి రోడ్డు సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

– తిరుచానూరుకు ప్రత్యేక ట్రాఫిక్ కారిడార్

రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు దర్శించుకునే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి టీటీడీ నిధులు రూ.90 కోట్లతో 2.5 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు డాలర్స్ దివాకర్ రెడ్డి వెల్లడించారు. యాత్రికుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, అన్నదాన కార్యక్రమాలకు అనువైన ప్రదేశాలు కేటాయించడంతో పాటు రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోకుండా ప్రత్యేక కారిడార్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

– 100 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు

మదనపల్లె–తిరుపతి, తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారులను అనుసంధానించేలా కల్యాణి డ్యామ్ నుంచి రంగంపేట, కొటాల, ఐతేపల్లి మీదుగా 6.8 కిలోమీటర్ల మేర 100 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో రూ.49 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, రెండో విడతకు మరో రూ.46 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని వివరించారు. అవసరమైన చోట్ల వంతెనలు, రైల్వే అండర్‌పాస్‌లను అనుసంధానిస్తూ రహదారిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

ఐతేపల్లి–వడమాలపేట, రేణిగుంట–చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో ఔటర్ బైపాస్ రహదారుల అనుసంధానంతో గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోడ్ల విస్తరణతో భూముల విలువ పెరగడంతో పాటు స్థానిక రైతులు, ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశముందని తెలిపారు.

– తాగునీటి సరఫరాకు రూ.30 కోట్లు

తిరుపతి నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు పేరూరు చెరువు నుంచి తుమ్మలగుంట మీదుగా అవిలాల ట్యాంకుకు నిరంతర నీటి సరఫరా కల్పించే ప్రాజెక్టుపై దృష్టి సారించినట్లు డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేతో కలిసి పలుమార్లు సమీక్షించిన అనంతరం రూ.30 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

-తుడా టవర్స్ పనులు తుది దశకు..

గతంలో నత్తనడకన సాగిన తుడా టవర్స్ నిర్మాణాన్ని వేగవంతం చేసి తుది దశకు తీసుకొచ్చినట్లు ఛైర్మన్ వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన సంస్థలు, వాణిజ్య దుకాణాలు, నివాస సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం చేపడుతున్నవన్నీ ఫేజ్‌-1 అభివృద్ధి పనులేనని, డిసెంబర్ నాటికి ఫేజ్‌-2 కింద మరిన్ని భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతామని చెప్పారు. తుడాను ప్రజా ప్రయోజనాలకు అంకితమైన సంస్థగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

– బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో పండుగ వాతావరణం

తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం తిరుపతి నగరంలోనూ కనిపించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్లు డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. నగరంలోని వ్యాపారులు, లాడ్జీలు, హోటళ్లు, భవన యజమానులు తమ ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, వీధుల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ యాత్రికులకు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఏడుకొండల ఆధ్యాత్మిక వైభవం తిరుపతి వీధుల్లోనూ ప్రతిబింబించేలా సమష్టిగా కృషి చేయాలని కోరారు.

నిధుల వినియోగంపై ఎమ్మెల్యే పులివర్తి నాని విమర్శలు

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వ హయాంలో తుడా వద్ద సుమారు రూ.450 కోట్ల నిధులు ఉన్నప్పటికీ ప్రజోపయోగ పనులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుతం నిధుల కొరత ఉన్నప్పటికీ తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్‌ ఛైర్మన్, అధికార యంత్రాంగం సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, లింక్ రోడ్ల అభివృద్ధికి తుడా ద్వారా ప్రాధాన్యం ఇస్తున్నందుకు ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఐతేపల్లి–రంగంపేట రహదారి ప్రణాళికలు 2018లోనే రూపొందించినప్పటికీ గత ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

– బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హామీ

బీసీ రిజర్వేషన్ల అంశంపై పులివర్తి నాని మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే దిశగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. కోర్టు పరమైన అడ్డంకులు ఎదురైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రయత్నిస్తామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.
తిరుపతి నగరంతో పాటు పరిసర నియోజకవర్గాల్లో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, వాణిజ్య సముదాయాల అభివృద్ధి ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే తుడా లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!