ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచెరువును కొల్లగొడుతున్న గ్రావెల్ మాఫియా..?

చెరువును కొల్లగొడుతున్న గ్రావెల్ మాఫియా..?

📰 Generate e-Paper Clip

చెరువును కొల్లగొడుతున్న గ్రావెల్ మాఫియా..?

-గరుడాద్రి చెరువుపై అక్రమ తవ్వకాల ముప్పు

-“ఇప్పటికైనా అధికారులు మేల్కొవాలి”

-బత్తలవల్లం గ్రామస్థుల ఆవేదన

గరుడధాత్రి న్యూస్ :

ప్రజలకు జీవనాధారంగా నిలవాల్సిన చెరువులు… ఇప్పుడు అక్రమ గ్రావెల్ దందాలకు కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం గ్రామంలోని గరుడాద్రి చెరువు ప్రస్తుతం అక్రమ గ్రావెల్ తవ్వకాలతో ప్రమాద అంచున నిలిచిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ ప్రజల కథనం ప్రకారం, కొంతకాలంగా చెరువు పరిసరాల్లో రాత్రింబవళ్లు భారీ వాహనాలతో గ్రావెల్ తరలింపు జరుగుతోందని ఆరోపిస్తున్నారు. చెరువు అడుగు భాగాన్ని విచక్షణారహితంగా తవ్వడం వల్ల చెరువు సహజ నిర్మాణం దెబ్బతింటోందని, భవిష్యత్తులో భారీ వర్షాలు కురిస్తే చెరువు బలహీనపడి ప్రమాదాలు సంభవించే అవకాశముందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తులు చెపుతున్నదాని ప్రకారం… ఈ తవ్వకాల కారణంగా భూగర్భ జలాల మట్టం పడిపోవడంతో పాటు రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో నేల బలహీనపడుతోందని, ఇలాగే కొనసాగితే గ్రామ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని అంటున్నారు.
“ప్రభుత్వాలు చెరువుల సంరక్షణపై పెద్దఎత్తున ప్రకటనలు చేస్తున్నా… క్షేత్రస్థాయిలో మాత్రం అక్రమ తవ్వకాలు ఆగడం లేదు” అంటూ స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామస్థులు తిరుపతి జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకుంటూ గరుడాద్రి చెరువును కాపాడాలని కోరుతున్నారు. అక్రమ గ్రావెల్ తరలింపును తక్షణమే నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
“ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును రక్షించకపోతే… భవిష్యత్తులో జరిగే నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?” అని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం గరుడాద్రి చెరువు వ్యవహారం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!