మురుగునీటి సమస్య పరిష్కరించకుండా కాంక్రీట్ తొలగింపుపై స్థానికుల ఆగ్రహం
గరుడధాత్రి న్యూస్ :
ఒకనాటి అధికారులు, పాలకుల నిర్లక్ష్యం నేడు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. పట్టణంలోని కోటమిట్ట ప్రాంతంలో మురుగునీటి సమస్యపై స్థానికులు, పంచాయతీ అధికారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని డ్రైనేజీ సమస్య చివరకు రోడ్డుపై కాంక్రీట్ తొలగింపు వివాదానికి దారితీసింది.
కోటమిట్టలో మునస్వామి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన ఇంటి ముందు గతంలో తక్కువ ఎత్తులో సీసీ రోడ్డు నిర్మించడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు, మురుగునీరు ఇంటి ముందు నిలిచిపోతున్నాయి. అదే వీధిలో నివాసం ఉంటున్న ప్రజలు బజారుకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు చేరాలన్నా ఆ మురుగునీటిలోంచే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ సమస్యపై మునస్వామితో పాటు స్థానికులు పలుమార్లు అధికారులను ఆశ్రయించి రోడ్డును ఎత్తు పెంచాలని విన్నవించినప్పటికీ స్పందన రాలేదని చెబుతున్నారు. దీంతో విసిగిపోయిన మునస్వామి స్వచ్చందంగా తన సొంత నిధులతో ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డుపై సుమారు ఒక అడుగు మేర కాంక్రీట్ వేసి ఎత్తు పెంచాడు.
అయితే ఇదే అంశంపై వీధిలో నివాసం ఉంటున్న మరో వ్యక్తి పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటన కొత్త మలుపు తిరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి ముని రవికుమార్ సిబ్బందితో కలిసి ఎక్సావేటర్ తీసుకుని అక్కడికి చేరుకుని రోడ్డుపై వేసిన కాంక్రీట్‌ను తొలగించే ప్రయత్నం చేశారు.
దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను అడ్డుకున్నారు. ముందుగా వీధిలో నిలిచిపోతున్న వర్షపు నీరు, మురుగునీరు పారేలా చర్యలు తీసుకుని, ఆ తరువాతే కాంక్రీట్ తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
స్థానికులు మాట్లాడుతూ… “ఏళ్లుగా మురుగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు, ఇప్పుడు కాంక్రీట్ తొలగించేందుకు మాత్రం ఆగమేఘాలపై రావడం బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు. “అసలు సీసీ రోడ్డు నిర్మాణం సక్రమంగా జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు” అని విమర్శించారు.
ప్రజా సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ వివాదం తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కోటమిట్టలో డ్రైనేజీ సమస్యతో పాటు అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
