సంపద సృష్టి’ పేరిట పచ్చి మోసం.. ధరల మోతతో జనం నడ్డి విరుస్తున్న సర్కారు !
-పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్
-పిచ్చాటూరులో భారీ నిరసన ర్యాలీ, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
గరుడధాత్రి న్యూస్ :
పిచ్చాటూరు అధికారంలోకి రాకముందు ‘సంపద సృష్టిస్తాం.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం’ అంటూ మాయమాటలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, తీరా గద్దెనెక్కాక అడ్డగోలుగా ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం పిచ్చాటూరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కన్వీనర్ కె.వి.చలపతి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు సర్కారు తీరుపై కన్నెర్రజేశారు.*
*ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. పెంచిన ఇంధన ధరలతో రవాణా ఛార్జీలు తడిసిమోపెడవుతున్నాయని, ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి బతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూటగడవని పేదలపై కరుణలేని భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే పెంచిన ధరలను వెనక్కి తీసుకుని ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నినాదాలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు రమేష్ రాజు, రామచంద్ర రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తోపయ్య, ఏవియం బాలాజీ రెడ్డి సూరిబాబు రెడ్డి, చెంగల్ రాయల్ రెడ్డి, రమేష్, చంద్ర శేఖర్, వెంకటేష్, చంద్రయ్య, గోవిందస్వామి, కారణమూర్తి, యేసు, నాగరాజు, శరత్ రాఘవ రెడ్డి లోకేష్, నగేష్ రాజులతో పాటు వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*.
