గరుడధాత్రి న్యూస్ :
రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, సామాజిక సామరస్యాన్ని పరిరక్షించడం మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో పోలీస్, పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ శాఖ మరియు ఇతర సంబంధిత విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, చట్టబద్ధమైన విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ నిబంధనలు, కోర్టు మార్గదర్శకాలు మరియు జంతు సంరక్షణ చట్టాలకు విరుద్ధంగా ఆవులు, దూడలు మరియు ఇతర నిషేధిత పశువుల వధ, అక్రమ రవాణా, అనుమతులు లేకుండా తరలింపు వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టులు, ప్రధాన రహదారులు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు.
గతంలో ఇలాంటి కేసుల్లో నేరాలకు పాల్పడిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అవసరమైతే వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు బౌండ్ ఓవర్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాల్లో జంతువులను వధించడం, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయడం, జంతు హింసకు పాల్పడడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే వాహనాల స్వాధీనం, అరెస్టులు మరియు క్రిమినల్ కేసుల నమోదు వంటి చర్యలు కూడా అమలు చేస్తామని తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా వదంతులు, పుకార్లు వ్యాప్తి చేసి మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలందరూ బక్రీద్ పండుగను పరస్పర గౌరవంతో, చట్ట నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎక్కడైనా మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా చిత్తూరు పోలీస్ Whatsapp నెంబర్ 9440900005 కు సమాచారం అందించాలని ఎస్పీ గారు కోరారు.
