చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామిగా దర్శనమిచ్చిన కళ్యాణ వెంకన్న
– హంసపై జ్ఞాన సరస్వతిగా కళ్యాణ వెంకటేశ్వరుడు
నారాయణవనం, మే 29, గరుడ ధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా మండల కేంద్రమైన నారాయణవనం లో వెలిసిన టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ పద్మావతి దేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలులో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం చిన్న శేష వాహనంపై వేణుగోపాలస్వామిగా, రాత్రి హంస వాహనంపై జ్ఞాన సరస్వతిగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో స్వామి అమ్మవార్లను మేల్కొల్పి తరువాత నిత్య పూజా కార్యక్రమాల అనంతరం 7 గంటలకు చిన్న శేష వాహనంపై వేణుగోపాలస్వామి గా కళ్యాణ వెంకన్న గ్రామ పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 11 గంటలకు స్వామి అమ్మవార్లకు ఆగమో క్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటలకు కల్యాణ వెంకటేశ్వరుడు జ్ఞాన సరస్వతిగా ఉంజల సేవలో భక్తులను కనువిందు చేశారు. రాత్రి 8 గంటలకు హంస వాహనంపై జ్ఞాన సరస్వతి గా కళ్యాణ వెంకన్న పురవీధులలో మేళ తాళాల మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కేరళ వాయిద్యం, చెక్క భజనలు నడుమ ఊరేగుతూ కర్పూర హారతులు అందుకుంటూ భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, సూపర్డెంట్ శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ ఈఈ భాస్కర్, ఆలయ అధికారి నాగరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ భట్టాచార్యులు, శ్రీనివాస భట్టాచార్యులు, ఆలయ సిబ్బంది, వాహన మోతగాళ్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
