-చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామిగా దర్శనం
-హంస వాహనంపై జ్ఞాన సరస్వతిగా కళ్యాణ వెంకటేశ్వరుడు
నారాయణవనం, మే 29 గరుడ ధాత్రి :
తిరుపతి జిల్లా నారాయణవనంలో వెలసిన టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ పద్మావతి దేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి, నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటలకు చిన్నశేష వాహనంపై గ్రామ పురవీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
తదుపరి ఉదయం 11 గంటలకు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటలకు ఉంజల్ సేవలో కళ్యాణ వెంకటేశ్వరుడు జ్ఞాన సరస్వతి అలంకారంలో భక్తులను కనువిందు చేశారు.
రాత్రి 8 గంటలకు హంస వాహనంపై జ్ఞాన సరస్వతిగా కళ్యాణ వెంకన్న పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు, చెక్కభజనల నడుమ సాగిన వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ ఈఈ భాస్కర్, ఆలయ అధికారి నాగరాజు, ప్రధాన అర్చకులు శ్రీధర్ భట్టాచార్యులు, శ్రీనివాస భట్టాచార్యులు, ఆలయ సిబ్బంది, వాహన మోతగాళ్లు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
