బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్4
బైరెడ్డిపల్లి మండలం జెడ్పీహెచ్‌ఎస్ తీర్థం పాఠశాల క్రీడా రంగంలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. తిరుపతిలో నిర్వహించిన అండర్–14 ఎస్.జి.ఎఫ్.ఐ. హ్యాండ్‌బాల్ ఎంపికల్లో జెడ్పీహెచ్‌ఎస్ తీర్థం 8వ తరగతి విద్యార్థి యశ్వంత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు.
తీర్థం జెడ్పీహెచ్‌ఎస్ నుంచి హ్యాండ్‌బాల్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికైన తొలి విద్యార్థిగా యశ్వంత్ నిలవడం పాఠశాలకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి రాష్ట్రస్థాయికి ఎదగడం పట్ల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తీర్థం గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీపతి హర్షం వ్యక్తం చేసి యశ్వంత్‌ను అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో జెడ్పీహెచ్‌ఎస్ తీర్థం పాఠశాలలో క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నామని ఆయన తెలిపారు.ఒక సంవత్సరం సేవకు… ఒక గొప్ప విజయానికి గుర్తుగా
యశ్వంత్ రాష్ట్రస్థాయి ఎంపిక వెనుక పాఠశాల పీడీ అల్తాఫ్ చేసిన కృషి ప్రత్యేకంగా నిలిచింది. విద్యార్థులపై నమ్మకంతో, వారి ప్రతిభను గుర్తించి, తన వ్యక్తిగత సమయాన్ని కూడా లెక్కచేయకుండా ప్రతిరోజూ మైదానంలో శిక్షణ అందిస్తూ యశ్వంత్‌ను ఎంపికలకు సిద్ధం చేశారు.
విద్యార్థి ఒకరోజులో రాష్ట్రస్థాయికి చేరుకోలేదని, దాని వెనుక రోజుల తరబడి చేసిన సాధన, ఓర్పు, క్రమశిక్షణ, పీడీ అల్తాఫ్ నిరంతర శ్రమ ఉన్నాయని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.
మరింత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, 2025 అక్టోబర్ 3న ఉపాధ్యాయ సేవలో చేరిన అల్తాఫ్‌కు సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయిన 2026 అక్టోబర్ 3న తన పాఠశాల నుంచి తొలి రాష్ట్రస్థాయి క్రీడా ఎంపిక లభించింది. ఒక ఉపాధ్యాయుడిగా తన మొదటి ఏడాది పూర్తయ్యే రోజునే తన విద్యార్థి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం ఆయనకు ఎంతో భావోద్వేగమైన, మరపురాని సందర్భంగా మారింది.
తీర్థం గ్రామానికి గర్వకారణం
తీర్థం గ్రామానికి చెందిన విద్యార్థి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందం నెలకొంది. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విజయాలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే తీర్థం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దల సహకారం మరియు ప్రోత్సాహం అభినందనీయం అని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా ఎస్‌ఎంసీ చైర్మన్ మోహన్, గోవిందస్వామి, సీఆర్‌పీ షేక్ షాబుద్దీన్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు యశ్వంత్‌ను హృదయపూర్వకంగా అభినందించారు.
జెడ్పీహెచ్‌ఎస్ తీర్థం నుంచి వెలువడుతున్న ఈ క్రీడా విజయాలు పాఠశాల విద్యార్థుల్లో కొత్త స్ఫూర్తిని నింపుతున్నాయి. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగి తీర్థం పాఠశాల పేరు, తీర్థం గ్రామం మరియు చిత్తూరు జిల్లాకు మరింత కీర్తి తీసుకురావాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.
