* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
* ప్రపంచ స్థాయి బ్రాండ్ గా అరకు కాఫీ.
* గిరిజనులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం.
కుప్పం,ఆగస్టు 09 (గరుడ ధాత్రి న్యూస్): ఆదివాసీల సంకల్పమే వారి అద్భుత ప్రగతికి మూలమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రకృతిని ఆరాధిస్తూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునే గిరిజనులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. సామాన్య ఆదివాసీ మహిళ అయిన ద్రౌపదీ ముర్ము నేడు దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని చేపట్టడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, మోదీలంతా సామాన్య కుటుంబాల నుంచే వచ్చారని గుర్తుచేస్తూ,దృఢ సంకల్పమే ఏ రంగంలోనైనా మార్పు తెస్తుందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశం, రాష్ట్రం, ఊరి అభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంలో గిరిజనులు ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ రికార్డు సాధించి, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిందని అభినందించారు. పోడు వ్యవసాయం వీడి, ఆర్గానిక్ సాగుతో గిరిజనులు అత్యంత విలువైన పంటలను ఉత్పత్తి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని 27.39 లక్షల మంది గిరిజన సోదరుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వపరంగా రూ.4,764 కోట్లు కేటాయించామని వెల్లడించారు.ఐటీడీఏల ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, 2,336 గిరిజన ఆవాసాలకు మిషన్ మోడ్లో రోడ్డు కనెక్టివిటీ అందిస్తున్నామని తెలిపారు. 2027 నాటికి ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, ఆవాసం, సోలార్ రూఫ్ టాప్స్ కల్పిస్తామన్నారు. ‘అడవి తల్లి బాట’ ద్వారా రూ.1,000 కోట్లతో 905 కి.మీ రోడ్లు వేశామని, డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్సులు, 108, 104 సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. డిజిటల్ కనెక్టివిటీ కోసం సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటిబెల్లం వంటి ఉత్పత్తుల ప్రాసెసింగ్ నుంచి బ్రాండింగ్ వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజనుల సంక్షేమం కోసమే మూడు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రకృతి సోయగాలున్న ఈ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. కొత్తగా కుదుర్చుకున్న 19 అవగాహన ఒప్పందాల ద్వారా 60 వేల మంది గిరిజనులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గిరిజన యువతకు ఉపాధి కోసం 1.5 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
25 ఏళ్ల క్రితమే తాము నాంది పలికిన అరకు కాఫీ నేడు ప్రపంచ స్థాయి బ్రాండ్గా ఎదిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సాగును ప్రోత్సహించేందుకు మరో లక్ష ఎకరాలకు విస్తరిస్తున్నామని, ఏజెన్సీ ప్రాంతాన్ని కాఫీ, మిరియాలు, పసుపు లాంటి పంటలకు బ్రాండ్గా మారుస్తామన్నారు. ప్రధాని మోదీ కూడా ఆస్ట్రేలియా ప్రధానికి అరకు కాఫీని బహుమతిగా ఇచ్చి ప్రమోట్ చేశారని, రాష్ట్రానికి వచ్చే అతిథులకు తాము దీనినే బహుమతిగా ఇస్తున్నామని చెప్పారు. పార్లమెంటులోనూ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. అటవీ ఉత్పత్తులకు విలువ జోడించి గిరిజనులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు.జీవో నెంబరు 3 ద్వారా గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే దక్కేలా గతంలో చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, దీనిపై గిరిజనులకు న్యాయం జరిగేలా ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల హక్కులను, సంక్షేమాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
విజయవాడలోని అంబేద్కర్ కళా వేదికలో గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా థింసా నృత్యం చేసి అలరించారు. వేదికపై విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, నిమ్మక జయకృష్ణ, ఎంపీ శివనాథ్, పలువురు గిరిజన సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి, గిరిజన ప్రజాప్రతినిధులు మరియు గిరిజనులు సంప్రదాయ లంబాడా నృత్యాలతో సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజనులు ఆయనకు సంప్రదాయ కొమ్ము తలపాగాను అలంకరించగా, సీఎం డప్పు చేతపట్టి వారందరిలో ఉత్సాహం నింపారు. అనంతరం థింసా నృత్యం చేస్తున్న మహిళలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు స్వయంగా అడుగులు వేసి గిరిజనులను అలరించారు. మంత్రి మాట్లాడుతూ ,వనదేవతలను, అమ్మవార్లుగా మనం పూజిస్తాం ఆరాధిస్తాం. అడవులే గిరిజనుల ఆరాధ్యదైవాలు. గిరిజనుల కోసం చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి ఇంటికీ వ్యాపారవేత్తను తయారుచేస్తున్నారు.
యావత్ రాష్ట్రంలో గిరిజన సోదర సోదరీమణులందరూ చంద్రబాబు కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. చదువుకున్నా ఉద్యోగాలు చేస్తున్నా. జీవితాల్లో ఎదిగినా ఎప్పటినుంచో ఉన్న చంద్రబాబు పథకాలే కారణం అన్నారు.
ఆదివాసీల సంకల్పమే వారి అద్భుత ప్రగతికి మూలం
RELATED ARTICLES
